సాక్షి, హైదరాబాద్: కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పేరుతో బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజాయని తేల్చినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను ధిక్కరించి, అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించినట్లు సమాచారం. కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్స్‌లో సీనియర్ ఐఏఎస్‌లు రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. తాజాగా చేసిన తనిఖీలు, ఆసుపత్రుల్లో జరిగిన అక్రమ వసూళ్లపై ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి నేడో రేపో నివేదిక ఇస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇప్పటివరకు ఆయా ఆసుపత్రులు చేసిన కరోనా చికిత్సలు, వాటికి వేసిన బిల్లులను, రికార్డులను ఈ బృందం క్షుణ్నంగా అధ్యయనం చేసింది. కొందరు సీనియర్ వైద్య నిపుణుల సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉన్న లక్షణాలు, ఆసుపత్రులు నిర్వహించిన చికిత్సను వైద్య నిపుణులు పరిశీలించారు. చికిత్సలో భాగంగా బాధితులకు ఉన్న లక్షణాలు, ఇచ్చిన మందులు, అనవసరంగా ఏమైనా వైద్యం చేశారా?.. వంటి వాటిని బృందం సభ్యులు సరిచూశారు.
కరోనాకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లతో పోల్చి ఏ మేరకు అధికంగా వసూలు చేశారన్న దానిపైనా పరిశీలన చేశారు. విచిత్రమేంటంటే.. కొన్ని ఆసుపత్రులైతే సర్కారు రేట్లకు ఏకంగా 15 రెట్లు కూడా అధికంగా వసూలు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ విచారణలో తేలినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన ధరలను ప్రైవేట్ ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించినా కొన్నిచోట్ల లేకపోవడంపై టాస్క్‌ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద తగు చర్యలు తీసుకునే విషయంలో కూడా టాస్క్‌ఫోర్స్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్‌లను పాటిస్తున్నాయా?.. లేదా?.. కూడా పరిశీలించింది.
అధిక బిల్లులు వాస్తవమే!
Published Wed, Sep 23 2020 5:36 AM | Last Updated on Wed, Sep 23 2020 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment