స్వాధీనం చేస్తున్న వాహనంతో పోలీసులు
శ్రీకాకుళం రూరల్: వారిని చూస్తే అచ్చం పోలీసులే అని భ్రమపడతాం. ఒకరు టక్..టైతో హుందాగా కారులో కూర్చుంటారు. మిగిలిన వారు పోలీసు గెటప్, సివిల్ డ్రస్సుల్లో ఉంటూ హడావుడి చేస్తుంటారు. రైడ్ పేరుతో లూటీలు చేయడం.. బెదిరింపులకు పాల్పడడం.. అవసరమైతే రెండు లాగి జీపులో ఎక్కించడం చూస్తే వీరు పోలీసులు కాదని ఎవరూ గుర్తించలేరు. అయితే పాపం పండటంతో వీరి గుట్టు రట్టయ్యింది. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రోడ్డుపై వీరు వ్యవహరించిన తీరుతో అనుమానం వచ్చిన సింగుపురం గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు యువకులను రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సింగుపురం, కరజాడ, బైరి, బట్టేరు పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చామని, ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులుగా తమను నియమించిదంటూ గార మండలం అంబటివానిపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు వారం రోజులుగా ఇన్నోవా కారులో తిరుగుతు హడావుడి చేస్తున్నారు. వీరిలో కుంచాల సంతోష్ 2017లో ఎక్సైజ్ శాఖకు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసేవాడు. 2018–19 కాలంలో హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీలో పనిలో చేరాడు. 2020 ఫిబ్రవరిలో స్వస్థలం వచ్చేసి జల్సాలకు అలవాటుపడ్డాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. గతంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎక్కడెక్కడ మద్యం బెల్టుషాపులు నిర్వహించేవారో, మందు ఎక్కడి నుంచి వస్తుందో తదితర విషయాలు తెలియడంతో నకిలీ పోలీసు అవతారమెత్తాడు. అదే గ్రామానికి చెందిన మర్రి రమణ, కొనుము రమణ, ధనాల జ్ఞానప్రసాద్, నక్క రంగారావు(వప్పంగి) సహాయంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులపేరుతో బెల్టుషాపుల వద్ద దందాలు మొదలుపెట్డాడు.
పోలీస్ స్టిక్కరింగ్ వాహనంతో..
రెండు నెలలు క్రితం సంతోష్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. దాని వెనక, ముందు భాగంలో పోలీస్ అని స్టిక్కరింగ్ చేసి టోల్‌ప్లాజాలు, సంతలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ దందాలు చేసేవాడు. ఇదే వాహనాన్ని ఉపయోగిస్తూ బైరి, సింగుపురం, కరజాడ పరిసర ప్రాంతాల్లో బెల్టుషాపులు నిర్వహించే వారివద్దకు వెళ్లి మద్యం సీసాలు లాక్కోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరించేవారు. భయపడి వారు ఇచ్చిన నగదును తీసుకొని అదే బెల్టుషాపు నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం సేకరించి వేరే ప్రాంతంలో బెల్టుషాపులు నిర్వహించే వారి వద్ద దాడులకు తెగబడేవారు.
ఎలా పట్టుబడ్డారంటే...
ఈ నెల 25న బుధవారం రాత్రి సింగుపురం, బైరి పరిసర ప్రాంతంలో ఒకే చోట నాలుగు బెల్టు షాపుల వద్ద దందాలకు పాల్పడ్డారు. జితేష్‌కుమార్ అనే ఓ వ్యాపారి వద్ద మూడు క్వార్టర్ బాటిళ్లు ఉన్నాయని తెలుసుకుని బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రహదారి మీదుగా వెళ్తున్న సింగుపురం గ్రామస్తులు చూసి పోలీసులైతే ఇలా రోడ్డుపై దాడులకు తెగబడరని సందేహించి ఇద్దరిని అక్కడికక్కడే పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారవ్వడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంబేడ్కర్, రూరల్ ఎస్‌ఐ లక్ష్మణరావులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. 18 మద్యం బాటిళ్లతో పాటు రూ.1500 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment