డ్రగ్ పెడ్లర్‌గా ఇంటర్ విద్యార్థి
► అతడే సూత్రధారిగా క్రయవిక్రయాలు
► నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. మాదకద్రవ్యమైన ఎక్స్‌టసీని తాను వినియోగించడంతో పాటు మరికొందరికి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్
పోలీసులు మంగళవారం మైనర్‌తో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. తార్నాక నాగార్జుననగర్‌కు చెందిన ఓ మైనర్ పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్ళకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసగా మారాడు.
ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి నుంచి గంజాయి ఖరీదు చేసేవాడు. తన ఇంటిపై ఉన్న ఓ గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి 2016లో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్‌టసీ, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలు ఖరీదు చేయడం ప్రారంభించిన మైనర్ తొలినాళ్ళల్లో తానే వినియోగించేవాడు. కొన్నాళ్ళకు విక్రేతగా మారి లాలాగూడకు చెందిన అల్తాఫ్ హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, బొగ్గులకుంటకు చెందిన ప్రశాంత్ పౌల్‌కు అమ్మడం ప్రారంభించాడు.
మంగళవారం 26 గ్రాముల ఎక్స్‌టసీని తీసుకుని వచ్చిన మైనర్ దాన్ని తార్నాక ప్రాంతంలో విక్రయించే ప్రయత్నం చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎస్.సైదాబాబు, కె.శ్రీనివాస్ వలపన్ని నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి మాదకద్రవ్యం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు ఉస్మానియా వర్శిటీ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న హన్నన్, కిషోర్ కోసం గాలిస్తున్నారు.