
నా భర్తను విడిపించండి
నా భర్తను విడిపించండి.. అంటూ ధర్మవరంలో కిడ్నాప్‌నకు గురైన జింకా రామాంజనేయులు భార్య జింకా లక్ష్మిదేవి కన్నీటి....
► మగ్గాల నిర్వాహకుడి భార్య వేడుకోలు
►24 గంటలు గడిచినా తెలియని జింకా రామాంజనేయులు ఆచూకీ
► రంగంలోకి స్పెషల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ధర్మవరం: నా భర్తను విడిపించండి.. అంటూ ధర్మవరంలో కిడ్నాప్‌నకు గురైన జింకా రామాంజనేయులు భార్య జింకా లక్ష్మిదేవి కన్నీటి పర్యంతమైంది. రామాంజనేయులును కిడ్నాప్ చేశామంటూ వాట్సప్ ద్వారా వీడియో పంపి డబ్బులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రామాంజనేయులు కిడ్నాప్ జరిగినప్పటి నుంచి వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాప్ సంఘటన వెలుగులోకొచ్చి 24 గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదు. ధర్మవరం పోలీసులు, అనంతపురం స్పెషల్ టాస్క్‌ఫోర్‌స పోలీసులు రంగంలోకి దిగి మమ్ముర గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి దాకా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
విచారంలో కుటుంబ సభ్యులు : రామాంజనేయులు, లక్ష్మిదేవికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి అభిశ్రీ, తనుశ్రీ కుమార్తెలు ఉన్నారు. రామాంజనేయులు శారదానగర్‌లో 8 మగ్గాలు ఏర్పాటు చేసుకొని కూలీల ద్వారా పట్టు చీరలు తయారు చేస్తుండేవాడు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, వివాదరహితుడని, ఎలాంటి దురలవాట్లు లేవని స్థానికులు చెప్తున్నారు. అయితే శనివారం సాయంత్రం కిడ్నాప్ సంగతి పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు, పట్టణ వాసులు రామాంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.