
కరీంనగర్‌లీగల్: మేకల విక్రయదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై మర్రిపల్లి రమేష్, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, మరో కానిస్టేబుల్ కోడూరి కనకశ్రీనివాస్‌కు ఆర్నెళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం తీర్పునిచ్చారు. పీ.పీ వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన జక్కుల సారయ్య, లంక అంజయ్య, మరికొంత మంది మేకల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మేకలను మహేంద్ర, టాటాఏస్ వాహనాల్లో కరీంనగర్, గంగాధర, హుస్నాబాద్ తదిరత ప్రాంతాల్లోని అంగడిబజార్‌లకు తరలించి విక్రయించేవారు. 2011 మార్చి 26న చొప్పదండి అంగడికి మేకలను తరలించారు.
సదరు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఎస్సై మర్రిపల్లి రమేష్ జరిమానా విధించాడు. దీంతో సారయ్య, తదితరులు మరునాడు ఎస్సైని కలిశారు. ఏడాది వరకు రూ.40వేలు మాముళ్లుగా ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పిన బాధితులు పదిహేను రోజులకు మళ్లీ ఎస్సైని కలిశారు. రూ.15 ఇవ్వాలని ఎస్సై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఎస్సై వద్దకు వెళ్లేందుకు గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 డిమాండ్ చేశాడు.దీంతో సారయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2011 ఏప్రిల్ 15న సారయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రూ.15వేలు ఎస్సైకి ఇవ్వబోతుం డగా రైటర్ శ్రీనివాస్‌కు ఇవ్వమని చెప్పాడు. రైటర్ రూ.15వేలు తీసుకున్నాడు. బయటకు రాగానే గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 తీసుకున్నాడు.
దీంతో ముందస్తు పథకం ప్రకారం వేచి ఉన్న ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనికి వెళ్లారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకుని ఎస్సై, గన్‌మెన్, రైటర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా వాగ్మూలంను నమోదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం ఎస్సై మర్రిపల్లి రమేష్(40), కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ (40)లకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా, కోడూరి కనక శ్రీనివాస్(47)కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు.
ప్రాసిక్యూషన్ తరఫున 20మంది సాక్షులను ప్రవేశపెట్టగా 13మంది కేసుకు వ్యతిరేకంగా, నిందితులకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో వీరిపై కేసు ఎందుకు నమోదు చేయరాదో డిసెంబర్ 20వ తేదీ వరకు సంజాయిషీని ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇందులో ఫిర్యాదుదారుడు జక్కు సారయ్య, లంక అంజయ్య, ట్రాప్ జరిగినపుడు హాజరైన సాక్ష్యులు డాక్టర్ గుర్రం శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ పూదరి నరేష్, ఏఎస్సై ముచ్చె మధుసూధన్‌రెడ్డితోపాటు మెరుగు జానయ్య, కానిస్టేబుల్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, పులి అంజయ్య, రంగు శ్రీనివాస్, తొర్తి కొమురయ్య, సాగాల రాజయ్య, జెట్టి ప్రభాకర్, బి. మల్లేశంకు నోటీసులు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఎస్సై రమేష్ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ గంగాధర పోలీస్‌స్టేషన్‌లో, కోడూరి కనక శ్రీనివాస్ ముస్తాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment