చిన్నారి పెళ్లి కూతుళ్లు! | today stopped four child marriages in distic | Sakshi
Sakshi News home page

చిన్నారి పెళ్లి కూతుళ్లు!

Published Sat, Mar 19 2016 3:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

చిన్నారి పెళ్లి కూతుళ్లు! - Sakshi

చిన్నారి పెళ్లి కూతుళ్లు!

మూడుముళ్లతో బందీ అవుతున్న బాల్యం..
జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు

నిరక్షరాస్యత, పేదరికం రాజ్యమేలుతున్న చోట ముక్కుపచ్చలారని బాలికల బాల్యం మూడుముళ్లతో బందీ అవుతోంది. బరువు దించుకునే పనిలో తల్లిదండ్రులు పదేళ్లు దాటిందే తడువుగా ఓ అయ్యచేతిలో పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. మాంగల్యమంటే అర్థం తెలియని వయస్సులోనే ఓ ఇంటి ఇల్లాలై పోతోంది బాలిక. ఆటబొమ్మలతో ఆడుకునే వయసులో పొత్తిళ్లపాపను ఆడిస్తోంది. ఎంత చైతన్య పరిచినా, పిల్లల భవిష్యత్ చీకటిమయమవుతుందని  వివరించినా జనం చెవికెక్కడం లేదు. నెలలో పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఇంకా కొన్ని వెలుగులోకి రాకుండా జరిగిపోతున్నాయి. - పరిగి/ వికారాబాద్ రూరల్

67జిల్లాలో గత మూడు నెలల్లో అడ్డుకున్న బాల్య వివాహాలు
15 - 20% బాల్య వివాహాల కారణంగా ప్రతి ఏడాది స్కూల్ మానేస్తున్న బాలికలు

 తల్లిదండ్రుల్లో మార్పు రావాలి..
గ్రామాల్లో అవగాహనా రాహిత్యంతోనే బాల్య వివాహాలు చేస్తున్నారు. మేం కల్పించుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన చోట ఫలితం ఉంటోంది. పీటలమీది పెళ్లిళ్లను ఆపేస్తున్నప్పుడు కొన్ని గ్రామాల్లో స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. అలాంటి సమయంలో పోలీసుల సాయం తీసుకుంటున్నాం. ప్రతిఒక్కరు వాళ్ల దృష్టికి వచ్చిన బాల్య వివాహం గురించి టోల్ ఫ్రీ నెంబర్‌కు చెప్పాలి. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి.. అప్పుడే వీటిని పూర్తిస్థాయిలో అరికట్టగలం.  - వరలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ

 జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు 
పరిగి/ వికారాబాద్ రూరల్ :  సమాజం సాంకేతికంగా శరవేగంతో దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాల్యం తన హ క్కును కోల్పోతూనే ఉంది. సామాజిక దురాచారం ఉనికి చాటుకుంటూ బాల్యాన్ని కబలించి వేస్తూనే ఉంది. బాల్యవివాహాలకు బలవుతున్న వారిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత బాలిక లే ఉంటున్నారు. చదువుకుంటూ ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకొని తమ పిల్లల్ని ఆడిస్తున్నారు. బాల్య వివాహాలు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక అంశాలను ప్రభావితం చేస్తాయని మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. 

 తాజాగా నిలిచిన వివాహాలు అనేకం..
తాజాగా పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లోనే తొమ్మిది బాల్య వివాహాలను అధికారులు నిలిపేశారు. నిలిపేసిన వాటిలో అనేక పదో తరగతి కంటే తక్కువ చదువుతున్న బాలికలవే. పరిగి మండలం భర్కత్‌పల్లిలో 9వ తరగతి చదవుతున్న బాలికను, పరిగి ఉన్నత పాఠశాలలో అదే తరగతి చదువుతున్న, బసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలిక, కస్తూర్భాలో చదువుతున్న ఇంకో చిన్నారి, 8వ తరగతి చదువుతున్న కుల్కచర్లకు చెందిన బాలిక.. ఇలా అనేక మంది వివాహాలు ఇప్పటికే  జరిగిపోయేవి. కానీ సకాలంలో టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందడంతో అధికారులు స్పందించి ఆపేశారు. వీరంతా కూడా 15 ఏళ్ల లోపు బాలికలే. 

  జాడలేని టాస్క్‌ఫోర్స్..
బాల్య వివాహాల నిర్మూలనకు 2004లో మండలస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఎంపీపీ చైర్మన్‌గా, తహసీల్దార్ కన్వీనర్‌గా, ఎంపీడీఓ, సీడీపీఓ, స్థాయిక ఎస్‌ఐ, పీహెచ్‌సీ డాక్టర్, సీఆర్‌పీఎఫ్ మండల కన్వీనర్లను సభ్యులుగా చేర్చారు. వీరందరూ ప్రతి నెలా బాల్య వివాహాలపై సమీక్ష సమావేశం నిర్వహించి బాల్య వివాహాల అదుపుకు కృషి చేయాల్సి ఉంది. రెండు మూడేళ్లపాటు పటిష్టంగా కొనసాగిన టాస్క్‌ఫోర్స్ ఆ తర్వాత అప్పుడప్పుడే ఉనికి చాటింది. 

 కారణం ఏదైనా బాలికే బలి!
బాల్య వివాహాలు జరగడంపై గ్రామీణ ప్రాంతాల్లో చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ సహేతుకంగా లేదు.   ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాన్నమ్మలు మనవ రాలి పెళ్లి ముచ్చట చూసి చనిపోతారని, పిల్ల పెద్దమనిషి అయిందని, పక్కింటి పిల్లలు ఎవరితోనో లేచిపోయారని, వరకట్నం ఎక్కువగా ఇచ్చుకోవాల్సి వస్తుందని తదితర కారణాలను చెబుతుండడం గమనార్హం. కారణాలు ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి హైస్కూల్‌లో బాల్యవివాహాల కారణంగా 10 నుంచి 20 మంది విద్యార్థులు బడులు మానేస్తున్నారు. 

 చట్టాలు ఏం చెబుతున్నాయి..
బాల్యవివాహాలు సామాజిక దురాచారంగా పరిగణించి 18 శతాబ్దంలోనే కందుకూరి వీరేషలింగం పంతులు సామాజిక ఉద్యమాన్ని నడిపారు. 1929లో బాల్యవివాహ నిర్మూలన చట్టం వచ్చింది. ఇది స్పష్టంగా లేనప్పటికీ 18 సంవత్సరాల ఆడపిల్లలకు, 21 ఏళ్లు నిండిన పురుషులకు మాత్రమే వివాహం జరిపించాలనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ చట్టం లో లొసుగులున్నాయని 2006లో తిరిగి ఆ చట్టాన్ని సవరిస్తూ బాల్య వివాహల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే ఆ వివాహాన్ని రద్దు చేయడంతోపాటు పెళ్లికొడుకుకు రూ.లక్ష జరిమానా, పెళ్లికి సహకరించిన వారికి జైలు శిక్ష, పెళ్లి నిర్వహించిన పంతులుకు జైలు తదితర అంశాలను స్పష్టం చేసింది. అయినా చట్టం అమల్లో  లోపాల వల్ల బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ సంస్థ సర్వే ప్రకారం నేటికీ గ్రామాల్లో  30 నుంచి 40 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయని తేలింది. 

 ఒక్కరోజు ముందే బ్రేక్..
శంషాబాద్ మండలంలో రెండు నెలల వ్యవధిలోనే అధికారులు రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. మండలంలోని సుల్తాన్‌పల్లిలోని నలుగురు కూతుళ్లున్న తల్లిదండ్రులు పాఠశాలలో చదువుతున్న కూతురుకు పెళ్లి చేయాలని భావించారు. వివాహానికి ఒక్కరోజు ముందే విషయం తెలియడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు  గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. 

అదే మండలంలోని జూకల్‌లోనూ ముగ్గురు కూతుళ్లున్న దంపతులు ఇంటర్ చదివే బాలికకు పెళ్లి చేయాలని చూశారు. ఈ నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. బాలిక కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగానే అధికారులకు ఉప్పందింది. వెంటనే గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలిపేశారు. 

 బంట్వారం మండలంలో మూడు..
ఇటీవలే బంట్వారం మండలంలో మూడు బాల్య వివాహాలు ఆగిపోయాయి. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు రెండు నెలల క్రితమే నిశ్చితార్ధం చేశారు. విషయం 1098 టోల్‌ప్రీ నంబరుకు చేరడంతో ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీనివాస్ అధికారులతో కలిసి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ బాలిక ఇప్పుడు మళ్లీ చదువుకుంటోంది.

బార్వాద్ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే విధంగా సుల్తాన్ పూర్‌కు చెందిన మరో బాలిక 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ మైనర్లు కావడంతో 1098కు సమాచారం అందింది. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి వయస్సు వచ్చే వరకు వివాహాలు చేయమని తల్లిదండ్రులతో ఒప్పంద పత్రాలు సైతం రాయించుకున్నారు. 

వికారాబాద్ నియోజకవర్గంలో నెల రోజులుగా 13 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు అడ్డుకున్నాయి. అధికారులు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి వేళ సమావేశాలు ఏర్పాటుచేసి చైతన్యం తీసుకువచ్చే బాగుంటుంది. బాల్య వివాహం అడ్డుకున్నచోట కౌన్సెలింగ్ ఇస్తున్నా.. అదే వివాహం మరికొన్ని రోజుల తేడాతో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఇటీవల మోమిన్‌పేట మండలంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నప్పటికీ 15 రోజుల తర్వాత వివాహం జరిగిపోయింది. 

మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక తనకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తున్నారని గత సంవత్సరం డిసెంబర్ 19న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లి ఇప్పుడే వద్దని, ఇంకా చదువుకుంటానని మొరపెట్టుకుంది. వెంటనే స్పందించిన జేసీ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి రిస్క్యూహోంలో చేర్పించారు. తర్వాత అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పెళ్లి ఇప్పుడే చేయవద్దని సూచించారు. ప్రస్తుతం బాలిక రిస్క్యూహోంలోనే ఉంటూ చదువుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement