
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ వల్ల పలు దేశాలు పెట్టుబడుల విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యంగా తయారీ రంగం చైనాపై పూర్తిగా ఆధారపడటంతో కరోనా గుణపాఠం నేర్పింది. దీంతో ఇప్పుడు పలు దేశాలు చైనా నుంచి తమ తయారీ రంగాన్ని ఇతర దేశాలకు తరలించడంతో పాటు కొత్త పెట్టుబడులకు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..
► దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
► కరోనా నేపథ్యంలో చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
► పరిశ్రమల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఐదుగురు సీనియర్ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
► ఈ కమిటీకి అనుబంధంగా మరో ఏడు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం.
► రంగాల వారీగా కంపెనీలను గుర్తించడం, ఆయా దేశాలతో సంప్రదించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చే బాధ్యతను ఈ సబ్ కమిటీలకు అప్పగించాం.
35 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో సంప్రదింపులు: శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి
► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది.
► అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చైనా, తైవాన్, కొరియా వంటి దేశాలకు చెందిన 35 కంపెనీలను ఇప్పటికే గుర్తించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా సంప్రదింపులు జరుపుతున్నాం.
► క్వాలకమ్, ఏఎండీ, సిస్కో, హెచ్‌కేసీ, స్కైవర్త్, బీవైడీ వంటి కంపెనీలకు లేఖలు రాశాం.
► రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, పాలసీలను వివరిస్తూ కంపెనీలకు లేఖలు రాశాం.
► వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే స్పందించి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చర్చలు జరిపాయి.
► ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ విడుదల కాగానే సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ప్రారంభించుకోవడానికి అనుమతులిచ్చాం.