
కల్తీ.. ‘కిక్కు’
ఒకటో పెగ్గు.. రెండో పెగ్గు దాకా ఓకే.. ఆ తర్వాత మందుబాబులు మత్తులోకి జారుకుంటారు. ఇక కొన్ని బార్‌షాప్ నిర్వాహకులు కల్తీ మూత తీస్తారు.
♦ మారుమూల ప్రాంతాల్లో జోరుగా మద్యం దందా
♦ గుట్టుచప్పుడు కాకుండా కాస్ట్‌లీ సరుకులోనూ..
♦ ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయాలు
♦ టేకులపల్లిలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన వ్యవహారం
♦ నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న ఎక్సైజ్‌శాఖ
ఒకటో పెగ్గు.. రెండో పెగ్గు దాకా ఓకే.. ఆ తర్వాత మందుబాబులు మత్తులోకి జారుకుంటారు. ఇక కొన్ని బార్‌షాప్ నిర్వాహకులు కల్తీ మూత తీస్తారు. కాస్ట్‌లీ మందులో ‘చీప్’క్వాలిటీని కలిపేస్తారు. అది తాగిన మద్యం ప్రియులకు ఇంకాస్త కిక్కు ఎక్కుతుంది. మళ్లీ.. మళ్లీ అదే బార్‌షాప్‌నకు వచ్చి కాస్ట్‌లీ మందుకు డబ్బు చెల్లించి కల్తీ మద్యం తాగివెళ్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో మస్తుగా జరుగుతున్న ఈ కల్తీ మద్యం దందా టాస్క్‌ఫోర్‌స దాడులతో టేకులపల్లి మండలకేంద్రంలో బుధవారం వెలుగు చూసింది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఏటా మద్యం కల్తీ దందా జోరుగా సాగుతూనే ఉంది. గతంలో వైరాలో కల్తీ మద్యంపై మద్యం ప్రియులు ఆందోళన చేశారు. ఈ సారి కూడా ఈ దందా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్లో సాగుతున్నా, ఎక్సైజ్‌శాఖ నామమాత్రపు దాడులతోనే సరిపెడుతోంది. టేకులపల్లి మండల కేంద్రంలోని వైన్‌షాపుపై టాస్క్‌ఫోర్స్ బుధవారం దాడులు చేసింది. కల్తీ మద్యం కలుపుతుండటంతోపాటు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తుండటంపై కేసులు నమోదు చేసింది. ఈ దాడులు జిల్లావ్యాప్తంగా సాగితేనే ఈ దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉన్న సీలు ఉన్నట్టే..
జిల్లాలో 148 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో మారుమూల ప్రాంతాల్లో ఉన్న దుకాణాలపై ఎక్సైజ్‌శాఖ నిఘా కొరవడిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎమ్మార్పీకన్నా ఎక్కువకు విక్రయిన్నారని అంటున్నారు. లిక్కర్, బీర్ బాటిళ్లపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందులోనూ ఎక్కువ ధర ఉన్న బాటిళ్లలో ధర తక్కువగా ఉన్న మద్యం కలుపుతుండటం గమనార్హం. రాయల్ స్ట్రాగ్, బ్లెండర్స్‌స్పైడ్, ఐబీ బాటిళ్లలోనే ఎక్కువగా చీప్ లిక్కర్‌ను కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ బాటిళ్లకు ఉన్న సీల్‌ను అలాగే ఉంచి.. మూతను చాకచక్యంగా తొలగించి అందులో చీప్ లిక్కర్‌ను కలుపుతారు. ఒక్కో ఫుల్ బాటిల్ నుంచి క్వార్టర్ బాటిల్ మద్యం తీసి దీనిలో చీప్ లిక్కర్‌ను ఈ ప్రక్రియలో నైపుణ్యం ఉన్న వారితో కలిపిస్తున్నారు. వీటిని కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువగానే విక్రయిస్తున్నారు.
టేకులపల్లిలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి
తాజాగా టేకులపల్లిలో ఓ వైన్‌షాపుపై టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసి ఈ దందాపై కేసులు నమోదు చేసింది. టేకులపల్లిలోని బోడబజారులో ఉన్న రవి వైన్స్‌కు టాస్క్‌ఫోర్స్ బృందం వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా మద్యాన్ని ఏ రేట్లకు అమ్ముతున్నారో స్వయంగా పరిశీలించింది. ఆ తర్వాత షాపు వెనుకాలే ఉన్న గోదాంలోకి వెళ్లారు. అదే సమయంలో మద్యం బాటిళ్లలో ఇతర ద్రావణాన్ని కలుపుతుండటాన్ని గమనించారు. మద్యాన్ని కల్తీ చేస్తున్నారనే అనుమానంతో బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షాపు లెసైన్స్ పత్రాలను పరిశీలించారు. షాపు, గోదాంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధిక రేట్లకు మద్యం విక్రయాలు, కల్తీ మద్యం నేపథ్యంలో షాప్, గోదాంకు తాళాలు వేయించి.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ఏజెన్సీలో మారుమూల ఉన్న మండల కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా గోదాంలో కల్తీ చేస్తున్నారు.
మద్యం మత్తులో బార్లలోనూ...
జిల్లావ్యాప్తంగా 46 బార్లున్నాయి. ఇందులో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. బార్లలో ఫుల్ బాటిల్ కాకుండా పెగ్‌ల వారీగా మద్యం విక్రయిస్తారు. ఒక పెగ్, రెండు పెగ్‌లు కంపెనీ మద్యం ఇచ్చిన తర్వాత.. మద్యం కల్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బార్లపై ఎక్సైజ్‌శాఖ అధికారులు కనీస తనిఖీలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.