టోల్ ఎత్తివేత.. ఏటీఎంల కోసం టాస్క్‌ఫోర్స్!
పెద్దనోట్లను రద్దు వల్ల దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితులను సడలించడం, రూ. 500, 2000 నోట్లను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకురావడం వంటి నిర్ణయాలు తీసుకున్న కేంద్రం వాహనదారులకు ఊరట కలిగిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులన్నింటిపై మరో నాలుగురోజులపాటు టోల్ రుసుమును రద్దుచేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఏటీఎంల కోసం టాస్క్‌ఫోర్స్!
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు సేవలు అందించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసింది. ఏటీఎంలలో కొత్తనోట్లు అందుబాటులోకి వచ్చేలా చేయడం, ఇందుకోసం ఏటీఎం సాఫ్‌వేర్లలో మార్పులు చేసి, రీయాక్టివేషన్ చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన కర్తవ్యం. దేశవ్యాప్తంగా ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ప్రజల కష్టాలు ఘననీయంగా తగ్గే అవకాశముంది.