
దొంగ దెబ్బ
ఎర్రకూలీల ఆగడాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు పెంచింది. .....
దొరికితే ఎర్రచందనం.. దొరక్కపోతే దొంగతన పారా హుషార్. రూటు మార్చిన ఎర్రకూలీలు తిరుమలకొండ మీద తొమ్మిది దుకాణాల లూటీ భక్తులను దోపిడీ చేసే అవకాశం? వివిధ ఆలయాల హుండీలపై ఎర్ర కూలీల కన్ను?
తిరుమల: ఎర్రకూలీల ఆగడాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు పెంచింది. శేషాచలంలో ఎక్కడికక్కడ నిఘా పెంచారు. దీంతో ఎర్ర కూలీలకు కొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఎర్రచందనం కోసం వచ్చి పట్టుబడుతున్నారు. ఇలా చాలా మంది కూలీలు వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఎర్రచందనం చెట్ల నరికివేతకు మాత్రమే పరిమితమైన వీరు తాజాగా దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు ఇక్కడి పాపవినాశనం తీర్థం ఎగువన ఉండే తొమ్మిది దుకాణాలను లూటీ చేశారు. దుకాణాల్లోని రూ.10 వేల నగదుతోపాటు రూ.లక్ష విలువైన వస్తు సామగ్రిని అపహరించుకుపోయారు.తిరుమల కాటేజీలు, ఆలయాలపై ఎర్రకూలీల ప్రభావం ఇప్పటికే తిరుమల శేషాచల అడవుల్లో వందలాది మంది ఎర్రకూలీలు మాటు వేశారు. రోజూ పట్టుబడుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. పాపవినాశనం ఘటనతో అక్కడి ఆలయంతోపాటు ఆకాశగంగ, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయాల హుండీలపై వీరు కన్ను పడే అవకాశం ఉంది. ఇక అటవీప్రాంతాలను ఆనుకుని ఉండే కాటేజీలు, అతిథి గృహాల్లో బస చేసే భక్తులపై కూడా ఎర్రకూలీల ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదో హెచ్చరికపాపవినాశనం మార్గంలోని దుకాణాలను లూటీ చేసిన ఎర్రకూలీలు పరోక్షంగా టీటీడీ భద్రత, పోలీసు చర్యల్ని హెచ్చరించినట్లైంది. ఎన్నడూ లేనివిధంగా ఏక కాలంలో తొమ్మిది దుకాణాలు లూటీకి గురికావడంపై దుకాణదారులే కాదు; క్రైం పోలీసుల సైతం విస్మయానికి గురయ్యారు. తాజా ఘటనతో ఇటు టీటీడీ విజిలెన్స్ విభాగం, అటు పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టూ టౌన్ పోలీసుల అదుపులో తొమ్మిది మంది కూలీలు
తిరుమలలో మంగళవారం తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్‌ను బుధవారం పోలీసులు ధ్రువీకరించనున్నారు.