
నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆటకట్టు
వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను తూర్పు....
► ముగ్గురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 160 నకిలీ సర్టిఫికెట్లు, 30 బోగస్ ఉద్యోగ సిఫార్సు లేఖలు,10 నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన బి.శేఖర్ నర్సారావుపేటలో 2010లో బీటెక్ ఫెయిలయ్యాడు. గుంటూరులో మూడు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగం కోసం 2014లో అమెరికా వెళ్లాలని భావించిన శేఖర్ గుంటూరులో శౌర్య కన్సల్టెన్సీ నిర్వాహకుడు రవిని సంప్రదించాడు. డిగ్రీ లేనిదే ఆయా దేశాలకు వెళ్లడం అసాధ్యమని అతను చెప్పాడు.
విజయవాడకు చెందిన ఇమ్మానుయేల్ నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తాడని తన బంధువు విజయ్ ద్వారా శేఖర్ తెలుసుకున్నాడు. రూ.38 వేల వెచ్చించి ఇమ్మానుయేల్ ద్వారా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు నుంచి బుందేల్‌ఖండ్ వర్శిటీకి చెందిన డిగ్రీ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. దీని ఆధారంగా న్యూజిలాండ్‌లోని ఓ సంస్థలో పీజీ డిప్లమోకు దరఖాస్తు చేసుకున్నా సీటు రాలేదు. దీంతో తాను కూడా నకిలీ సర్టిఫికెట్ల విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న శేఖర్... రవి, ఇమ్మానుయేల్‌తో కలిసి రంగంలోకి దిగాడు. ఎస్సార్‌నగర్ పరిధిలో శేఖర్ గ్రూప్ ఓవర్సీస్ సర్వీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.
నకిలీ సర్టిఫికెట్ల కోసం తమ వద్దకు వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ముఠా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు సాయంతో వాటిని రూపొందించి అందిస్తున్నారు. ఢిల్లీ, తమిళనాడు, ఝూన్సీ, సిక్కిం యూనివర్శిటీల పేర్లతో తయారవుతున్న నకిలీ సర్టిఫికెట్లను భారీ మొత్తాలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం ఆదివారం దాడి చేసిన శేఖర్, రవి, ఇమ్మానుయేల్‌లను అరెస్టు చేసింది. కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తోంది.