
పోలీస్ శాఖలో 105 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలు, కమిషనరేట్లను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో 105 కొత్త పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఇటీవల జరిగిన కేబినెట్ ఆమోదించడంతో ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల్లో నాన్‌క్యాడర్, అదనపు ఎస్పీ, డీఎస్పీ పోస్టుల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
సివిల్ విభాగంలో 23 నాన్‌క్యాడర్ ఎస్పీ పోస్టులు, అదే విధంగా పోలీస్ కమ్యూనికేషన్‌లో 2 నాన్‌క్యాడర్ ఎస్పీ పోస్టులు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ కోటాలో సివిల్ విభాగంలో 17, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో ఒక అదనపు ఎస్పీ పోస్టును ఏర్పాటుచేశారు. ఇకపోతే డీఎస్పీ కోటాలో సివిల్ విభాగంలో 57 పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ 2, కమ్యూనికేషన్ విభాగంలో 3 పోస్టులు ఏర్పాటుచేశారు.
టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు..: నూతనంగా ఏర్పాటయిన కరీంనగర్, రామగుండం, వరంగల్, సిద్దిపేట్, నిజామాబాద్, ఖమ్మం కమిషనరేట్లలో నేరాల నియంత్రణ, నేరస్థులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించేందుకు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ పోస్టులను ఏర్పాటుచేశారు. మంజూరు చేసిన 57 పోస్టుల్లోనే ఈ డీఎస్పీ పోస్టులుంటాయని ఆర్థిక శాఖ జీవోలో స్పష్టంచేసింది.