విశాఖపట్నం: ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ టాస్క్‌ఫోర్స్‌లో నగర పోలీస్ కమిషనర్, జిల్లా పోలీస్ సూరింటెండెంట్, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డ్వామా, డీఆర్‌డీఎ పీడీలు, ఇరిగేషన్ ఎస్‌ఈ, గ్రౌండ్ వాటర్ డీడీ, డీపీఒ, డీటీసీ, ఇంజనీరింగ్ శాఖల హెడ్‌లు, సబ్‌కలెక్టర్, ఆర్డీవో, వీపీటీ, ఎన్‌టీపీసీ, స్టీల్‌ప్లాంట్ తదితర బల్క్ యూజింగ్ సంస్థల ప్రతినిధులు, మైన్స్ ఏడీ తదితరులు సభ్యులుగా ఉంటారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్సు కమిటీలకు అనుమతించిన ఇసుక రీచ్‌ల నిర్వహణా బాధ్యతలను అప్పగించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కలెక్టర్ యువరాజ్ మీడియాకు వివరించారు.
అందుబాటులో ఉన్న ఇసుక పరిమాణం, నాణ్యతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ఇసుక రీచ్‌లను మూడు కేటగిరిలుగా విభజించారు. కాశీపట్నం, కైలాసపట్నం, నారాయణరాజుపేట రీచ్‌లను కేటగిరి-1 పరిధిలోకి తీసుకురాగా, ఇరిగేషన్ రిజర్వాయర్లలోని ఇసుకను కేటగిరి-2, నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుకను కేటగిరి-3 కింద పరిగణిస్తారు. తొలి కేటగిరి పరిధిలోని ఇసుకను పోర్టుట్రస్ట్‌తోపాటు బల్క్ యూజర్లయిన బిల్డర్స్‌కు కేటాయిస్తారు. కేటగిరి-2లో ఉన్న ఇసుకను సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తారు. కేటగిరి-3లోని ఇసుకను పూర్తిగా ప్రజల వినియోగార్ధం కేటాయిస్తారు.
ఆయా రీచ్‌లకు పర్యావరణానికి, ఆనకట్టలకు, కట్టడాలకు ఎలాంటి హానీ కలగకుండా ఇసుక తవ్వకాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిప్యూటీ ఈఈ, ఈఈ కే డర్ స్థాయి ఇంజినీర్లను రీచ్‌ల ఇన్‌చార్జిలుగా నియమించారు. ఆయా రీచ్‌ల పర్యవేక్షణ, ఇసుక స్టాక్ యార్డుల నిర్వహణ తదితర బాధ్యతలను వీరు పర్యవేక్షిస్తారు. ఇసుక తవ్వకాలు లోడింగ్ తదితర పనుల నిర్వహణకు యంత్రాల వినియోగం పూర్తిగా నిషేధించారు. అనుమతించిన ఇసుక రీచ్‌లకు రహదారి సౌకర్యాలు, ర్యాంపుల నిర్మాణ బాధ్యతను పంచాయతీరాజ్‌కు అప్పగించారు. అలాగే రీచ్‌లు.. తవ్వకాలు వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచాల్సిన బాధ్యతను మైన్స్ డిపార్టుమెంట్‌కు అప్పగించారు. ఇందుకు అవసరమైన లేబర్‌ను సమకూర్చుకోవడం.. వారికి చెల్లించాల్సిన చార్జీలను నిర్ణయించే బాధ్యతను డీఆర్‌డీఎ పీడీకి అప్పగించారు. విశాఖ జిల్లా డిమాండ్‌కు తగ్గట్టుగా ఇసుక స్థానికంగా లేనందున తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు రీచ్‌లను కేటాయించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తూర్పు కలెక్టర్‌ను కోరారు. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ మూడు రీచ్‌లను కేటాయించారు. ముగ్గళ్ల, జొన్నాడ, గోపాలపురం రీచ్‌లను కేటాయించడంతో ఆ రీచ్‌ల నుంచి ఇసుక తరలింపునకు చర్యలు చేపట్టారు. వాల్టా చట్టం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకు లోబడే ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంది.
ఇసుక తవ్వకాలకు టాస్క్‌ఫోర్స్
Published Wed, Mar 16 2016 12:00 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
Advertisement
Advertisement