
రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఎట్టకేలకు అరెస్టు ....
గోదామును సీజ్ చేసిన అధికారులు
షాద్‌నగర్ : అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొందుర్గు మండలం పుల్లప్పగూడకు చెందిన అల్లె గోపాల్, పాపిశెట్టి శ్రీనివాస్ కొన్నాళ్లుగా సబ్సిడీ బియ్యాన్ని హైదరాబాద్ నగరంలోని రేషన్ డీలర్ వద్ద కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా సరఫరా చేసేవారు. ముందుగా బియ్యాన్ని బోలెరో, ట్రాలీఆటోలలో ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాసుమల్లగూడెం శివారులో ఉన్న గోదాముకు తరలించేవారు.
అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కర్నూలుకు చెందిన కన్నారెడ్డికి చెందిన డీసీఎంలో కర్ణాటక రాష్ట్రానికి బియ్యాన్ని తీసుకెళ్లేవారు. ఈ క్రమంలోనే గత నెల 26న 15 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా నాగులపల్లి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గోపాల్, బోలెరో డ్రైవర్ రతన్‌సింగ్, ట్రాలీఆటో డ్రైవర్ వడ్డ చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేశారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ లింబారెడ్డి, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. అక్కడి గోదాములో ఇంకా 149 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు తాజాగా బుధవారం తేలడంతో సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.