అందరికీ ఆల్బెండజోల్
- జాయింట్ కలెక్టర్ హరికిరణ్
- పద్దెనిమిదేళ్ల వారందరినీ కవర్ చేయాలని ఆదేశం
- రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం
కర్నూలు(హాస్పిటల్): పల్స్‌పోలియో తరహాలో ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లలోపు వారందరూ నులిపురుగుల నివారణ మాత్రలు మింగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఒకటి నుంచి 18 ఏళ్లలోపు వారు 7,90,000 మంది ఉన్నట్లు గుర్తించామని జేసీ తెలిపారు. ఈ నెల 10వతేదీన నులిపురుగుల నివారణ దినోత్సవం వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. పాఠశాలల, కళాశాలల విద్యార్థులెవరూ ఆ రోజు గైర్హాజరు కాకుండా హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వాలన్నారు. 9వ తేదిలోగా అన్ని విద్యాలయాలకు నులిపురుగుల నివారణ మాత్రలను చేరవేయాలని ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ హేమలతను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. మాత్రలు మింగిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుంటే ప్రథమ చికిత్స అందించేందుకు 108, 102 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం.277305, 277309), డివిజన్ స్థాయిలో డీసీహెచ్‌ఎస్‌కు ఫోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ మీనాక్షిమహదేవ్‌ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అర్బన్‌హెల్త్ సెంటర్ సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్‌డీఏ పీడీ వై. రామకృష్ణ, డెమో ఎర్రంరెడ్డి, డీఐఓ వెంకటరమణ పాల్గొన్నారు.