లబ్ధిదారుల ఎంపికకు.. దారిద్య్రరేఖకు సంబంధం లేదు
దక్షిణాది రాష్ట్రాలతో నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ భేటీలో పనగారియా
సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖ అనేది పేదరికాన్ని అంచనా వేసే కొలమాన మాత్రమే తప్ప పేదరిక నిర్మూలన పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికం కాదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. పేదరికపు శాతం ఏ మేరకు తగ్గిందోఅంచనా వేసే దారిద్య్ర రేఖను లబ్ధిదారుల ఎంపికతో ముడిపెట్టొద్దని అన్ని రాష్ట్రాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అందరికీ ఇళ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆహార భద్రత, పారిశుద్ధ్యం తదితర పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు దారిద్య్ర రేఖతో సంబంధమే లేదని ఉదాహరించారు. నీతి ఆయోగ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదరిక నిర్మూలన టాస్క్‌ఫోర్స్.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో హైదరాబాద్‌లో బుధవారం తొలి సమావేశం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సలహాదారు అశోక్‌కుమార్ జైన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఎస్‌పీ టక్కర్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షదీవులకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో స్త్రీ నిధి భేష్: మహిళా స్వయం సహాయక సంఘాలకు 48 గంటల్లోనే రుణమిచ్చేలా తెలంగాణలో అమలవుతున్న స్త్రీ నిధి కార్యక్రమాన్ని పనగారియా ప్రశంసించారు. ‘‘తమిళనాడులో అక్షయపాత్ర పేరుతో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆదర్శంగా ఉంది.పంట ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు స్వయం సహాయక సంఘాలతో రైతులను అనుసంధానం చేయడం ఏపీలో సత్ఫలితాలిచ్చింది. వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరతను అధిగమించేందుకు 75 శాతం చెల్లించేందుకు రైతులు ముందుకొస్తే మిగతా 25 శాతాన్ని ఉపాధి హామీ నుంచి చెల్లించాలనే టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదనను కౌలు రైతులకూ వర్తింపజేయాలని ఏపీ సూచించింది. ఉపాధి హామీ పనుల్లో 40 శాతం యంత్ర సామూగ్రి, 60 శాతం కూలీలుండాలనే నిబంధనను పంచాయతీ యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోవాలనే సూచన వచ్చింది’’ అన్నారు.
తాగునీరు మహాప్రభో!
ఈ భేటీలో పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండా అయినా, దాదాపుగా రాష్ట్రాలన్నీ తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లాయి. తాగునీటి కొరతను తీర్చేందుకు అత్యంత ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని కోరాయి. ఆర్థిక సాయమందిచాలని కోరగా, కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పనగారియా అన్నారు. మిషన్ భగీరథకు ఆర్థిక సాయం చేయాలన్న అధికారుల విజ్ఞప్తిపై ఆచితూచి స్పందించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈనెల 22న జైపూర్‌లో పశ్చిమాది రాష్ట్రాలతో, మే 2న ఉత్తరాది రాష్ట్రాలతో, మే 6న ఈశాన్య రాష్ట్రాలతో సమావేశమవుతుందని చెప్పారు.