న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో జాతి ప్రయోజనాల కోసం ఇరువురు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ రాజీ ధోరణితో విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ‘‘అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌తో పోలిస్తే భారత్‌లో ఆర్‌బీఐకి చట్టపరంగా తక్కువ స్వతంత్రత ఉంది. కానీ, ఆచరణలో ఫెడ్‌కు సమానమైన స్వతంత్రతను ఆర్‌బీఐ అనుభవిస్తోంది’’ అని పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ సన్నిహిత సహకారంతో కలసి పనిచేయాలన్నారు. రెండింటి మధ్య విభేదాలున్నా, తప్పనిసరిగా రాజీధోరణితో జాతి ప్రయోజనాల కోసం కలసి పనిచేయాలన్నారు.
పనగరియా ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోనూ ప్రభుత్వం, ఫెడరల్ రిజర్వ్ పలు సందర్భాల్లో కలసి పనిచేస్తాయని, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఇది జరిగిందని పనగరియా తెలిపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఉమ్మడి వేదికను ప్రస్తావించడానికి బదులుగా మీడియా వాటి మధ్య విభేదాలను ఎత్తిచూపడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సమస్య, ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం.
ఆర్‌బీఐ, ప్రభుత్వం విభేదాలు పరిష్కరించుకోవాలి
Published Fri, Nov 9 2018 1:28 AM | Last Updated on Fri, Nov 9 2018 1:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment