panagariya
-
ఆర్బీఐ, ప్రభుత్వం విభేదాలు పరిష్కరించుకోవాలి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో జాతి ప్రయోజనాల కోసం ఇరువురు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ రాజీ ధోరణితో విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ‘‘అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌తో పోలిస్తే భారత్‌లో ఆర్బీఐకి చట్టపరంగా తక్కువ స్వతంత్రత ఉంది. కానీ, ఆచరణలో ఫెడ్‌కు సమానమైన స్వతంత్రతను ఆర్బీఐ అనుభవిస్తోంది’’ అని పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ సన్నిహిత సహకారంతో కలసి పనిచేయాలన్నారు. రెండింటి మధ్య విభేదాలున్నా, తప్పనిసరిగా రాజీధోరణితో జాతి ప్రయోజనాల కోసం కలసి పనిచేయాలన్నారు. పనగరియా ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోనూ ప్రభుత్వం, ఫెడరల్ రిజర్వ్ పలు సందర్భాల్లో కలసి పనిచేస్తాయని, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఇది జరిగిందని పనగరియా తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ఉమ్మడి వేదికను ప్రస్తావించడానికి బదులుగా మీడియా వాటి మధ్య విభేదాలను ఎత్తిచూపడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించారు. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ సమస్య, ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. -
ఎయిరిండియా ప్రైవేటీకరణే సరి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రుణభారం మోయలేనంత స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని ప్రైవేటీకరించడమే సరి అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. దీనిపై వచ్చే ఆరు నెలల్లో కేంద్రం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘భారీ స్థాయిలో రుణాలు పేరుకుపోయిన ఎయిరిండియా ఏదో పేరుకే నడుస్తోంది. ఇప్పటికే రూ. 52,000 కోట్ల మేర అప్పులు ఉన్నాయి.. పైగా ప్రతి ఏటా మరో రూ. 4,000 కోట్ల రుణం తోడవుతోంది. దీన్ని ఇలాగే భరిస్తూ పోవడం సాధ్యం కాదు. ఏది ఏమైనా.. ఎయిర్‌లైన్ నిర్వహణ ప్రైవేట్ సంస్థ చేతికి చేరడమే మంచిదని నా అభిప్రాయం‘ అని పనగారియా పేర్కొన్నారు. ఎయిరిండియా భవిష్యత్‌పై ఇంకా కసరత్తు జరుగుతున్నప్పటికీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించడమే మంచిదని నీతి ఆయోగ్ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలు దిశగా టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రత్యేక హోదా కథ ముగిసింది...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కథ ముగిసిందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రానికి హోదాకు మించిన ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పనగరియా ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానిక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం వచ్చాక రాష్ట్రాలకే అన్ని నిధులని అన్నారు. కాగా ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని దేశంలో ఆ కేటగిరీకి చెందిన 11 రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక హోదా అనుభవిస్తున్నాయని, ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వనవసరమే లేదని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
జీడీపీ 8% పైనే: పనగారియా
న్యూఢిల్లీ: మంచి వర్షాలు, సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ కలసి దేశీయ వృద్ధి రేటును తదుపరి త్రైమాసికాల్లో 8 శాతం పైకి తీసుకెళుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన త్రైమాసికాల్లో జీడీపీ 8 శాతంపైనే ఉంటుందనే విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సంస్కరణల ప్రభావం ఇంకా మనం చూడలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో పాలనాపరమైన సీరియస్ అంశాలు ఎన్నో ఉండేవన్నారు. ప్రాజెక్టులు నిలిచిపోయాయని, కేంద్రంలో నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దేశీయ జీడీపీ రేటు ఆరు త్రైమాసికాల కనిష్ట రేటు అయిన 7.1 శాతానికి పడిపోవడం వెనుక మైనింగ్, నిర్మాణ రంగాల్లో స్తబ్దతే కారణంగా పనగరియా పేర్కొన్నారు. ఈ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 7.1 శాతం నిరుత్సాహపరిచేదేనని, తన అంచనాల కంటే తక్కువగానే ఉందని పనగిరియా అన్నారు. అయితే, మొదటి త్రైమాసికంలో రేటుపై వర్షాల ప్రభావం లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాల జోరుతో దేశీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 9 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన 135 మిలియన్ టన్నులకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి 124 టన్నులుగానే ఉంది. -
లబ్ధిదారుల ఎంపికకు.. దారిద్య్రరేఖకు సంబంధం లేదు
దక్షిణాది రాష్ట్రాలతో నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ భేటీలో పనగారియా సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖ అనేది పేదరికాన్ని అంచనా వేసే కొలమాన మాత్రమే తప్ప పేదరిక నిర్మూలన పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికం కాదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. పేదరికపు శాతం ఏ మేరకు తగ్గిందోఅంచనా వేసే దారిద్య్ర రేఖను లబ్ధిదారుల ఎంపికతో ముడిపెట్టొద్దని అన్ని రాష్ట్రాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అందరికీ ఇళ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆహార భద్రత, పారిశుద్ధ్యం తదితర పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు దారిద్య్ర రేఖతో సంబంధమే లేదని ఉదాహరించారు. నీతి ఆయోగ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదరిక నిర్మూలన టాస్క్‌ఫోర్స్.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో హైదరాబాద్‌లో బుధవారం తొలి సమావేశం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సలహాదారు అశోక్‌కుమార్ జైన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షదీవులకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో స్త్రీ నిధి భేష్: మహిళా స్వయం సహాయక సంఘాలకు 48 గంటల్లోనే రుణమిచ్చేలా తెలంగాణలో అమలవుతున్న స్త్రీ నిధి కార్యక్రమాన్ని పనగారియా ప్రశంసించారు. ‘‘తమిళనాడులో అక్షయపాత్ర పేరుతో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆదర్శంగా ఉంది.పంట ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు స్వయం సహాయక సంఘాలతో రైతులను అనుసంధానం చేయడం ఏపీలో సత్ఫలితాలిచ్చింది. వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను అధిగమించేందుకు 75 శాతం చెల్లించేందుకు రైతులు ముందుకొస్తే మిగతా 25 శాతాన్ని ఉపాధి హామీ నుంచి చెల్లించాలనే టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదనను కౌలు రైతులకూ వర్తింపజేయాలని ఏపీ సూచించింది. ఉపాధి హామీ పనుల్లో 40 శాతం యంత్ర సామూగ్రి, 60 శాతం కూలీలుండాలనే నిబంధనను పంచాయతీ యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోవాలనే సూచన వచ్చింది’’ అన్నారు. తాగునీరు మహాప్రభో! ఈ భేటీలో పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండా అయినా, దాదాపుగా రాష్ట్రాలన్నీ తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లాయి. తాగునీటి కొరతను తీర్చేందుకు అత్యంత ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని కోరాయి. ఆర్థిక సాయమందిచాలని కోరగా, కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పనగారియా అన్నారు. మిషన్ భగీరథకు ఆర్థిక సాయం చేయాలన్న అధికారుల విజ్ఞప్తిపై ఆచితూచి స్పందించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈనెల 22న జైపూర్‌లో పశ్చిమాది రాష్ట్రాలతో, మే 2న ఉత్తరాది రాష్ట్రాలతో, మే 6న ఈశాన్య రాష్ట్రాలతో సమావేశమవుతుందని చెప్పారు.