ఎయిరిండియా ప్రైవేటీకరణే సరి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రుణభారం మోయలేనంత స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని ప్రైవేటీకరించడమే సరి అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. దీనిపై వచ్చే ఆరు నెలల్లో కేంద్రం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘భారీ స్థాయిలో రుణాలు పేరుకుపోయిన ఎయిరిండియా ఏదో పేరుకే నడుస్తోంది. ఇప్పటికే రూ. 52,000 కోట్ల మేర అప్పులు ఉన్నాయి.. పైగా ప్రతి ఏటా మరో రూ. 4,000 కోట్ల రుణం తోడవుతోంది. దీన్ని ఇలాగే భరిస్తూ పోవడం సాధ్యం కాదు.
ఏది ఏమైనా.. ఎయిర్‌లైన్ నిర్వహణ ప్రైవేట్ సంస్థ చేతికి చేరడమే మంచిదని నా అభిప్రాయం‘ అని పనగారియా పేర్కొన్నారు. ఎయిరిండియా భవిష్యత్‌పై ఇంకా కసరత్తు జరుగుతున్నప్పటికీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించడమే మంచిదని నీతి ఆయోగ్ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలు దిశగా టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.