జీడీపీ 8% పైనే: పనగారియా
న్యూఢిల్లీ: మంచి వర్షాలు, సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ కలసి దేశీయ వృద్ధి రేటును తదుపరి త్రైమాసికాల్లో 8 శాతం పైకి తీసుకెళుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన త్రైమాసికాల్లో జీడీపీ 8 శాతంపైనే ఉంటుందనే విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సంస్కరణల ప్రభావం ఇంకా మనం చూడలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో పాలనాపరమైన సీరియస్ అంశాలు ఎన్నో ఉండేవన్నారు. ప్రాజెక్టులు నిలిచిపోయాయని, కేంద్రంలో నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దేశీయ జీడీపీ రేటు ఆరు త్రైమాసికాల కనిష్ట రేటు అయిన 7.1 శాతానికి పడిపోవడం వెనుక మైనింగ్, నిర్మాణ రంగాల్లో స్తబ్దతే కారణంగా పనగరియా పేర్కొన్నారు. ఈ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 7.1 శాతం నిరుత్సాహపరిచేదేనని, తన అంచనాల కంటే తక్కువగానే ఉందని పనగిరియా అన్నారు. అయితే, మొదటి త్రైమాసికంలో రేటుపై వర్షాల ప్రభావం లేదన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాల జోరుతో దేశీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 9 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన 135 మిలియన్ టన్నులకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి 124 టన్నులుగానే ఉంది.