సాక్షి, హైదరాబాద్: ఆక్టోపస్‌లా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. స్టార్ హోటళ్లు, పబ్‌లలో డ్రగ్స్ సరఫరా వ్యవస్తీకృతంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ స్థాయి ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు తదితర అధికారగణంతో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బలగాలు బెల్టు షాపులు, మద్యం విడి విక్రయాల నియంత్రణ వంటి సాధారణ ఉల్లంఘనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.
కీలకమైన నార్కోటిక్స్ నేరాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు, పబ్‌లు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు గంజాయి, కొకైన్, హాష్ ఆయిల్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కూడా నేర నియంత్రణలో ఆ శాఖ వైఫల్యానికి కారణమవుతోంది. ప్రధానంగా రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలకు, జిల్లాస్థాయి నిఘా విభాగాలకు, మొబైల్ టాస్క్‌ఫోర్సు బృందాలకు మధ్య సరైన సహకారం, సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకరిద్దరు అధికారులు అంకితభావంతో పని చేసినా వారికి సరైన ప్రోత్సాహం, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించడం లేదు. దీంతో నగరం నలుమూలలా డ్రగ్స్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్‌లో పోలీసుల తనిఖీల్లో కొకైన్ లభించడం ఎక్సైజ్ శాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
మొక్కుబడి తనిఖీలు..
ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించే మొక్కుబడి తనిఖీలు నెలవారీ మామూళ్ల కోసమే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అనేక చోట్ల పబ్‌లు, హోటళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసినా చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు తెరిచి ఉంచినా, మైనర్లను అనుమతించినా పట్టించుకోవడం లేదు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, సికింద్రాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘తమ వల్లనే మద్యం అమ్మకాలు పెరిగి భారీ ఆదాయం వచ్చినట్లు కొందరు అధికారులు తమ పనితనానికి నిదర్శనంగా చెబుతారు. కానీ వాళ్ల ప్రమేయం లేకుండానే అమ్మకాలు జరుగుతాయి. ఆదాయం వస్తుంది’ అని ఓ అధికారి చెప్పారు. అక్రమార్జనపై ఉన్న ధ్యాస నేరనియంత్రణలో లేకపోవడంతో మాఫియా జడలు విప్పుతోందనే విమర్శలున్నాయి.
సీఎం ఆదేశించినా అంతే సంగతులు..
డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదేశించినా ఆచరణలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో కీలక విధులు నిర్వహించిన కొందరు అధికారులను బదిలీ చేయడంతో చాలా నష్టం వాటిల్లింది. తాజాగా జరిగిన పదోన్నతులు, బదిలీలతో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ తిరిగి బలోపేతమయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి.
(చదవండి: ఆ మూడు టేబుళ్లే కీలకం!)
Comments
Please login to add a commentAdd a comment