సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో బర్త్ రేషియో (జననాల రేటు) చూస్తే అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. కొన్ని జిల్లాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య రేషియో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గడిచిన ఏడాది డిసెంబర్ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుంటూరులో శుభపరిణామం..
మొత్తం 13 జిల్లాల్లో గతేడాది సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలున్నది ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే. ఈ జిల్లాలో గడచిన రెండేళ్లలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. అన్నిజిల్లాల కంటే అనంతపురం జిల్లాలో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉన్నట్టు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. రమారమి ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు లెక్క. కర్నూలు జిల్లాలోనూ కేవలం 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అమ్మాయి అనగానే అబార్షన్ చేయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పకడ్బందీగా లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలు
రాష్ట్రంలో పీసీ పీ అండ్ డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యులు (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని చెప్పారు. కొంతమంది గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి. అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment