ఓ యూట్యూబర్ నిర్వాకం.. సోషల్‌మీడియాలో కలకలం
మండిపడ్డ శ్రీవారి భక్తులు.. విచారణకు టీటీడీ విజిలెన్స్ ఆదేశం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతలోని డొల్లతనం, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా మొబైల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ప్రాంక్ వీడియోని చిత్రీకరించడం.. ఆ తర్వాత దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. తమిళనాడుకు చెందిన ఓ వివాదాస్పద యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ ఇటీవల తన మిత్రులతో కలిసి మొబైల్‌ఫోన్‌తో దర్శన క్యూలోకి ప్రవేశించాడు.
నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు నటించాడు. వాసన్‌ను చూసిన కంపార్టుమెంటులోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి గేట్లు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకిలేవడంతో టీటీఎఫ్ వాసన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని తన మిత్రులు ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలను టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్‌స్ట్రాగాం పేజీలో వాసన్ పోస్ట్‌చేయడంతో తమిళనాడులో ఇది వైరల్ అయింది. దర్శన క్యూల్లో భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై తమిళనాడులో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్‌ను అరెస్టుచేయాలని సామాజిక మాధ్యమాల్లో భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
విచారణకు టీటీడీ విజిలెన్స్ ఆదేశాలు..
ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది. ప్రాంక్ వీడియోలు చిత్రికరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారని టీటీడీ తెలిపింది. కానీ, ఒకరిద్దరు ఆకతాయిల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment