ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట! | Two cheaters arrested in hyderabad who sell fake diamonds | Sakshi
Sakshi News home page

ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!

Published Thu, Feb 1 2018 3:42 AM | Last Updated on Thu, Feb 1 2018 4:38 AM

Two cheaters arrested in hyderabad who sell fake diamonds - Sakshi

నకిలీ వజ్రాన్ని, స్వాధీనం చేసుకున్న నగదును చూపిస్తున్న కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు. చిత్రంలో నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద సండే మార్కెట్‌లో ఖరీదు చేసిన రాయి అది.. సాధారణంగా కోటు గుండీల్లో పొదగడానికి వినియోగిస్తుంటారు.. దీన్ని ఓ చోర ద్వయం రూ.4.5 కోట్ల విలువైన వజ్రంగా నమ్మించింది.. మార్కెట్‌లో ఖరీదు చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారంటూ పరిచయస్తుడికే ఎర వేసి.. ఆ గుండీని రూ.1.2 కోట్లకు అమ్మేసింది.. విషయం టాస్క్‌ఫోర్స్‌ వద్దకు చేరడంతో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.1.15 కోట్ల నగదు, నకిలీ వజ్రం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో..
ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అథర్‌ సిద్ధిఖీ, ఆర్సీపురం వాసి మహ్మద్‌ సల్మాన్‌ఖాన్‌ ముత్యాలు, రత్నాల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీటి నుంచి గట్టెక్కడానికి భారీ స్కెచ్‌ వేశారు. రత్నాల వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో వజ్రం పేరుతో ఎవరినైనా మోసం చేద్దామని భావించారు. సల్మాన్‌ గతంలో నాంపల్లిలోని మహ్మద్‌ ఖాన్‌ జ్యువెలర్స్‌లో సేల్స్‌ మెన్‌గా పని చేశాడు. ఆ సమయంలో అతడితో కలసి పనిచేసిన సనత్‌నగర్‌ వాసి షేక్‌ హాజీ అలియాస్‌ ఇలియాస్‌ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. వజ్రం విక్రయం పేరుతో అతడిని మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు.

రూ.3,500కు స్టోన్‌ ఖరీదు చేసి..
ఈ నెల 14న ఖాన్, అథర్‌ చార్మినార్‌ వద్ద సండే మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ అమ్ముతున్న కోటు బటన్‌కు ఏర్పాటు చేసే భారీ స్టోన్‌ వీరిని ఆకర్షించింది. దాన్ని రూ.3,500కు ఖరీదు చేసి.. ఓ బాక్సులో పెట్టి 25 క్యారెట్ల వజ్ర మంటూ ప్రచారం చేశారు. హాజీని సంప్రదించిన ఖాన్‌ తనకు తెలిసిన వ్యక్తి వద్ద రూ.4.5 కోట్ల విలువ చేసే మేలైన వజ్రం ఉందని, మార్కె ట్‌లో ఖరీదు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారని చెప్పి నమ్మించాడు. సదరు వ్యక్తికి అత్యవస రంగా డబ్బు అవసరమై రూ.1.2 కోట్లకే అమ్ముతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఖరీదు చేస్తే.. వారంలోనే రూ.4.5 కోట్లకు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ చెప్పాడు. దీంతో అప్పులు చేసిన హాజీ తన దగ్గర ఉన్న డబ్బు కలిపి రూ.1.2 కోట్లు సిద్ధం చేశాడు.

లాడ్జికి రప్పించి మోసం..
ఈ నెల 18న హాజీని నాంపల్లిలోని ఓ లాడ్జికి రప్పించిన ఖాన్‌.. ‘వజ్రం’తోపాటు అథర్‌నూ అక్కడకు తీసుకువచ్చాడు. హాజీ ఎదురుగా వివిధ ‘పరీక్షలు’ చేసినట్లు నటించిన అథర్‌ అది అత్యంత విలువైన వజ్రమంటూ షో చేశాడు. దీంతో పూర్తిగా నమ్మిన హాజీ ఆ మొత్తం వారికి ఇచ్చి స్టోన్‌ తీసుకెళ్లాడు. వారం రోజులు వేచి చూసినా ‘వజ్రాన్ని’ ఖరీదు చేసే పార్టీలను తీసుకురాక పోవడం, తనకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో హాజీ స్వయంగా రంగంలోకి దిగాడు. మార్కెట్‌లో సదరు స్టోన్‌ను విక్రయిం చడానికి ప్రయత్నం చేశాడు. సదరు ‘వజ్రాన్ని’ పరిశీలించిన వ్యాపారులు అది కోటుకు వినియోగించే గుండీ స్టోన్‌గా తేల్చారు. దీంతో మోసపోయానని గుర్తించిన హాజీ అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం ఖాన్, అథర్‌లను పట్టుకుని రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకుంది. కేసును అబిడ్స్‌ పోలీసులకు అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement