fake diamonds
-
నకిలీ వజ్రం ఇచ్చి.. రూ.58 లక్షలు స్వాహా
కాణిపాకం (యాదమరి): నకిలీ వజ్రం ఇచ్చి ఓ వ్యక్తి నుంచి రూ.58 లక్షలు దోచేశారు ముగ్గురు ఘరానా మోసగాళ్లు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు, బంగారుపాళెంకు చెందిన దామోదరం, తవణంపల్లెకు చెందిన బొజ్జయ్య నాలుగు నెలల క్రితం నకిలీ వజ్రం తీసుకొచ్చి కాణిపాకంలోని భాస్కర్ నాయుడుకు రూ.58.6 లక్షలకు విక్రయించారు. భాస్కర్ నాయుడు దీన్ని విక్రయించేందుకు నెల క్రితం ఓ వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లాడు. అక్కడ వజ్రం నకిలీదని తెలియడంతో అవాక్కయ్యాడు. వజ్రం తిరిగి ఇచ్చేస్తాను, డబ్బులు ఇవ్వండని సదరు ముగ్గురు వ్యక్తులను బతిమలాడినా ససేమిర అనడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వజ్రంతో గుండె కోశావ్ మోదీ..
ప్రేయసితో తన బంధం వజ్రంలా ఎప్పటికీ నిలిచిపోవాలనుకున్నాడు కెనడా యువకుడు పౌల్ అల్ఫాన్సో. వజ్రపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగి తమ బంధానికి కొత్త కాంతులు అద్దాలని కలలు కన్నాడు. ఆ కలలు కల్లలయ్యాయి. విలన్ ఆమె తండ్రి కాదు.. నీరవ్ మోదీ! ‘వజ్రం’తో సుతి మెత్తగా అతడి గుండె కోశాడు ఆ ఘరానా మోసగాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగేసి, దేశం విడిచి పారిపోయిన ఆ ఆర్థిక నేరగాడు.. పౌల్‌కు నకిలీ వజ్రపుటుంగరాలు అంటగట్టాడట. దీంతో గాళ్ ఫ్రెండ్ అతడికి బ్రేకప్ చెప్పేసిందట! ఇంతకీ ఈ ప్రేమికుడికి మోదీ ఎక్కడ తగిలాడు? పౌల్ ఓ పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్. 2012లో – బెవిర్లీ హిల్స్ హోటల్ వందేళ్ల పండగ వేళ మోదీని మొదటిసారి కలిశాడు. కొద్ది మాసాల తర్వాత మలిబులో ఇద్దరూ కలసి డిన్నర్ కూడా చేశారు. మోదీ మాటలు పౌల్‌ను ఉత్సాహపరిచాయట. అతడిలో ఈ యువకుడు ఓ అన్నయ్యను కూడా చూశాడట. ఈ నేపథ్యంలో 2018 ఏప్రిల్‌లో మోదీకి పౌల్ మెయిల్ చేశాడు. తన గాళ్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయబోతున్నానని, లక్ష డాలర్ల విలువైన ‘ప్రత్యేక’ ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తయారు చేసివ్వాలని కోరాడు. ఇంతలో ఆయన గాళ్ ఫ్రెండ్ మరో ఉంగరంపై ముచ్చటపడింది. పౌల్ దాన్ని కూడా ఆర్డర్ చేశాడు. హాంగ్‌కాంగ్ షోరూమ్‌లో రెండు ఉంగరాల కోసం మొత్తం రెండు లక్షల డాలర్లు చెల్లించాడు. జూన్‌లో మోదీ సహాయకుడు అరీ నుంచి ఉంగరాలు అందుకున్న ఆ ప్రేమికుడు.. వాటిని చూసుకుని పరవశించిపోయాడు. ప్రేయసికి వజ్రపుటుంగరాలు సమర్పించుకుని తన ప్రేమను మరోసారి ప్రకటించుకున్నాడు. పెళ్లి ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది. ఇద్దరూ కలసి ఉంగరాలకు బీమా చేయించాలనుకున్నారు. కానీ మోదీ ఉంగరాల తాలూకూ పత్రాలు పంపలేదు. దీంతో పౌల్ ఆయనకు పలుమార్లు ఈమెయిల్ పెట్టాడు. ఎప్పటికప్పుడు అవి దారిలో వున్నాయంటూ మోదీ నమ్మబలికాడు. ఇంతలో ఆయన గాళ్‌ఫ్రెండ్ ఉంగరాలను పరీక్ష చేయించింది. అవి నకిలీవని తేలడంతో.. పౌల్ నమ్మలేకపోయాడు. అలా జరగడానికి వీల్లేదంటే వీల్లేదన్నాడు. మోదీ ఆర్థిక మోసాల గురించిన వార్తలు చదివాక, తాను మోసపోయానని గ్రహించాడు ఆ యువకుడు. ఇలాంటి భారీ లావాదేవీలు చేసేటప్పుడు పౌల్ చాలా జాగ్రత్తగా వుంటాడట. కానీ దేశాలనే ముంచేసే నేరగాడికి పౌల్‌ను బోల్తా కొట్టించడం ఒక లెక్కా? ఇది జరిగాక, పౌల్ గాళ్‌ఫ్రెండ్ ఆయనకు బ్రేకప్ చెప్పింది. తన మనసంతా ఆక్రమించేసిన ప్రేయసి గుడ్‌బై చెప్పడంతో అతడు పని కూడా చేయలేకపోతున్నాడు. తాను తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోయానని చెబుతున్న ఈ యువకుడు.. మోదీపై కాలిఫోర్నియా అత్యున్నత న్యాయస్థానంలో దావా వేశాడు. తన మనసును ముక్కలు చేసినందుకు 3 మిలియన్ డాలర్లు చెల్లించాలంటున్నాడు. మొత్తం 4.2 మిలియన్ డాలర్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావ్’ అంటూ మోదీకి తీవ్ర పదజాలంతో మెయిల్ కూడా పెట్టాడట ఈ భగ్న ప్రేమికుడు. పాపం పౌల్! -
ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టిన ‘నీరవ్ మోదీ’
న్యూఢిల్లీ : నీరవ్ మోదీ.. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేసిన ఘనుడు. ఇతన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీ బృందాలు తెగ ప్రయత్నిస్తున్నాయి. కానీ అతను ఎక్కడున్నాడో తెలియదు. నీరవ్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయి ఉంది. భారత్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న ఇతను, ఓ ప్రేమ జంట మధ్య చిక్కు రేపాడట. కెనడాకు చెందిన ఓ వ్యక్తికి, ఈ డైమండ్ కింగ్ నకిలీ డైమండ్ రింగులను అమ్మాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం డైమండ్ రింగ్‌లను ఆర్డర్ చేసిన కెనడా పౌరుడికి, నకిలీవి అంటగట్టాడు. కానీ అవి నకిలీవని, అది కూడా నీరవ్ మోదీ నుంచి కొన్నవని తెలియడంతో, గర్ల్‌ఫ్రెండ్ ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో తీవ్ర డిప్రెషన్లోకి కుంగిపోయాడు ఆ కెనడా వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే... అల్ఫోన్సో 2012లో ఓ ఈవెంట్లో నీరవ్ మోదీని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరికి మంచి బంధం ఏర్పడింది. అల్ఫోన్సో పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి డైమండ్ రింగ్ ఇచ్చి, ప్రపోజ్ చేసి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అంటే 2018 ఏప్రిల్‌లో లక్ష డాలర్ల బడ్జెట్లో ‘స్పెషల్ ఎంగేజ్మెంట్ రింగ్’ పంపించాలని నీరవ్ మోదీకి ఈమెయిల్ చేశాడు. కానీ అప్పటికే నీరవ్ మోదీ-పీఎన్బీ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ వ్యక్తికి ఈ స్కాం గురించి తెలియలేదు. ఇదే అదునుగా చూసుకుని, నీరవ్ మోదీ ‘పర్ఫెక్ట్’ 3.2 క్యారెట్ గుండ్రటి కట్ డైమాండ్ రింగ్‌ను అల్ఫోన్సోకు పంపించాడు. హై-క్వాలిటీ గ్రేడ్, కలర్‌లెస్ స్టోన్‌తో ఉన్న దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. నీరవ్ మోదీ తనకు కావాల్సిన రింగ్ పంపడంతో, వెంటనే అల్ఫోన్సో ఆనంద భరితుడై కృతజ్ఞతలతో మెసేజ్ పంపాడు. కానీ తన గర్ల్‌ఫ్రెండ్ మరో డిజైన్ కోరుకోవడంతో, మరో డైమాండ్ రింగ్‌ను కూడా 80వేల డాలర్లకు నీరవ్ నుంచే తెప్పించుకున్నాడు. ఈ రింగ్‌లను మోదీ అసిస్టెంట్ అరీ, అల్ఫోన్సోకు అందించాడు. ఆ డైమండ్ రింగ్‌ల నగదును నీరవ్ హాంకాంగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అల్ఫోన్సో. ఆ తర్వాత డైమండ్ రింగ్‌ల ఇన్వాయిస్, అధికారి సర్టిఫికేట్లను పంపించమని ఎన్నిసార్లు అడిగినా నీరవ్ పంపించలేదు. నీరవ్ పంపించిన రెండు రింగ్‌లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది కూడా. కానీ రింగ్‌ల సర్టిఫికేట్లు లేకపోతే, ప్రమాదంలో పడతామని అనుకున్న, అదే విషయంపై చాలా సార్లు మోదీకి ఈమెయిల్స్ పంపారు. సర్టిఫికేట్లు వస్తున్నాయంటూ నీరవ్ నమ్మబలికాడు. కానీ ఎంతకీ అవి రాలేదు. అల్ఫోన్సో ప్రియురాలు ఈ రింగ్‌లను తీసుకెళ్లి డైమండ్ విలువను లెక్కగట్టే వారికి చూపించింది. వారు అవి నకిలీ డైమండ్స్ అని తేల్చేశారు. అదే విషయం ప్రియురాలు, అల్ఫోన్సోకు చెప్పడంతో, అలా జరగదని, వాటి కోసం రెండు లక్షల డాలర్లు ఖర్చు చేశానని, ఇవి నీరవ్ పంపించాడంటూ చెప్పుకొచ్చాడు. విషయం తెలియడంతో, అల్ఫోన్సో ప్రియురాలు అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో మానిసకంగా కుంగిపోయిన అల్ఫోన్సో మోదీకి కోపంతో మరో ఈమెయిల్ చేశాడు. ‘నాకు ఎలాంటి బాధను ఇచ్చావో నీకేమైనా తెలుస్తుందా. నా ప్రియురాలు ఇప్పుడు మాజీ ప్రియురాలు అయింది. మా అద్భుతమైన క్షణాన్ని నాశనం చేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ ఈమెయిల్ పంపాడు. ఇదే విషయంపై అల్ఫోన్సో, మోదీకి వ్యతిరేకంగా సివిల్ దావా వేశాడు. 4.2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ కేసు విచారణకు రానుంది. -
నీరవ్‌మోదీపై నకిలీ వజ్రాలమ్మిన కేసు
-
ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద సండే మార్కెట్లో ఖరీదు చేసిన రాయి అది.. సాధారణంగా కోటు గుండీల్లో పొదగడానికి వినియోగిస్తుంటారు.. దీన్ని ఓ చోర ద్వయం రూ.4.5 కోట్ల విలువైన వజ్రంగా నమ్మించింది.. మార్కెట్లో ఖరీదు చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారంటూ పరిచయస్తుడికే ఎర వేసి.. ఆ గుండీని రూ.1.2 కోట్లకు అమ్మేసింది.. విషయం టాస్క్‌ఫోర్స్ వద్దకు చేరడంతో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.1.15 కోట్ల నగదు, నకిలీ వజ్రం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అథర్ సిద్ధిఖీ, ఆర్సీపురం వాసి మహ్మద్ సల్మాన్‌ఖాన్ ముత్యాలు, రత్నాల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీటి నుంచి గట్టెక్కడానికి భారీ స్కెచ్ వేశారు. రత్నాల వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో వజ్రం పేరుతో ఎవరినైనా మోసం చేద్దామని భావించారు. సల్మాన్ గతంలో నాంపల్లిలోని మహ్మద్ ఖాన్ జ్యువెలర్స్‌లో సేల్స్ మెన్‌గా పని చేశాడు. ఆ సమయంలో అతడితో కలసి పనిచేసిన సనత్‌నగర్ వాసి షేక్ హాజీ అలియాస్ ఇలియాస్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. వజ్రం విక్రయం పేరుతో అతడిని మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు. రూ.3,500కు స్టోన్ ఖరీదు చేసి.. ఈ నెల 14న ఖాన్, అథర్ చార్మినార్ వద్ద సండే మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ అమ్ముతున్న కోటు బటన్‌కు ఏర్పాటు చేసే భారీ స్టోన్ వీరిని ఆకర్షించింది. దాన్ని రూ.3,500కు ఖరీదు చేసి.. ఓ బాక్సులో పెట్టి 25 క్యారెట్ల వజ్ర మంటూ ప్రచారం చేశారు. హాజీని సంప్రదించిన ఖాన్ తనకు తెలిసిన వ్యక్తి వద్ద రూ.4.5 కోట్ల విలువ చేసే మేలైన వజ్రం ఉందని, మార్కె ట్లో ఖరీదు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారని చెప్పి నమ్మించాడు. సదరు వ్యక్తికి అత్యవస రంగా డబ్బు అవసరమై రూ.1.2 కోట్లకే అమ్ముతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఖరీదు చేస్తే.. వారంలోనే రూ.4.5 కోట్లకు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ చెప్పాడు. దీంతో అప్పులు చేసిన హాజీ తన దగ్గర ఉన్న డబ్బు కలిపి రూ.1.2 కోట్లు సిద్ధం చేశాడు. లాడ్జికి రప్పించి మోసం.. ఈ నెల 18న హాజీని నాంపల్లిలోని ఓ లాడ్జికి రప్పించిన ఖాన్.. ‘వజ్రం’తోపాటు అథర్‌నూ అక్కడకు తీసుకువచ్చాడు. హాజీ ఎదురుగా వివిధ ‘పరీక్షలు’ చేసినట్లు నటించిన అథర్ అది అత్యంత విలువైన వజ్రమంటూ షో చేశాడు. దీంతో పూర్తిగా నమ్మిన హాజీ ఆ మొత్తం వారికి ఇచ్చి స్టోన్ తీసుకెళ్లాడు. వారం రోజులు వేచి చూసినా ‘వజ్రాన్ని’ ఖరీదు చేసే పార్టీలను తీసుకురాక పోవడం, తనకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో హాజీ స్వయంగా రంగంలోకి దిగాడు. మార్కెట్లో సదరు స్టోన్‌ను విక్రయిం చడానికి ప్రయత్నం చేశాడు. సదరు ‘వజ్రాన్ని’ పరిశీలించిన వ్యాపారులు అది కోటుకు వినియోగించే గుండీ స్టోన్‌గా తేల్చారు. దీంతో మోసపోయానని గుర్తించిన హాజీ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం ఖాన్, అథర్‌లను పట్టుకుని రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకుంది. కేసును అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
నకిలీ బంగారం విక్రయించే ముఠా గుట్టు రట్టు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నకిలీ బంగారం, వజ్రాలు విక్రయించే ముఠా గుట్టును శుక్రవారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 134 నకిలీ బంగారం బిస్కెట్లు, 57 నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.