సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు.
మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది.
ఇదీ ప్రతిపాదన
ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది.
తెగని మహానది జలాల వివాదం
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు.
మహానది టు కావేరి వయా గోదావరి
జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది.
గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు.
ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment