Interconnect
-
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
వాయిస్ బీపీవో హబ్‌గా భారత్..
న్యూఢిల్లీ: వాయిస్ ఆధారిత బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే దిశగా దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్రం మరింత సరళతరం చేసింది. అన్ని రకాల ఓఎస్పీ (ఇతర సర్వీస్ ప్రొవైడర్స్) మధ్య ఇంటర్ కనెక్టివిటీని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీ, విదేశీ యూనిట్లకు ఒకే రకం నిబంధనలను వర్తింపచేయనుంది. వీటితో పాటు మరికొన్ని నిబంధనల సడలింపుతో భారత్‌లో వాయిస్ ఆధారిత సెంటర్ ఉన్న అంతర్జాతీయ సంస్థలు.. ఇకపై ఉమ్మడి టెలికం వనరులను ఉపయోగించుకుని దేశ, విదేశాల్లో కస్టమర్లకు సర్వీసులు అందించడానికి వీలు కానుంది. ఇప్పటిదాకా ఇలాంటి సేవల కోసం ప్రతీ కంపెనీ తమ సొంత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండేది. తాజా పరిణామాలతో కంపెనీలు తమ వనరులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలు కానుంది. ‘సరళతరం చేసిన నిబంధనలతో బీపీవో పరిశ్రమలో సింహ భాగం వాటాను భారత్ దక్కించుకోగలదు‘ అని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఐటీ–బీపీఎం పరిశ్రమ వృద్ధికి దోహదపడటంతో పాటు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు నిబంధనల సడలింపు తోడ్పడగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. టెక్ రంగం వృద్ధికి దోహదం.. గతేడాది నవంబర్లోనే ఓఎస్పీ మార్గదర్శకాల్లో కొన్నింటిని సరళతరం చేశామని, తాజాగా వీటిని మరింత సడలించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనితో అనేకానేక నిబంధనలను పాటించాల్సిన భారం కంపెనీలకు తగ్గుతుందని, టెక్ పరిశ్రమ వృద్ధికి ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం వనరులను ఉపయోగించుకుని అప్లికేషన్ సర్వీసులు, ఐటీ ఆధారిత సేవలు, కాల్ సెంటర్ సేవలు లేదా ఇతరత్రా అవుట్సోర్సింగ్ సర్వీసులు అందించే సంస్థలను ఓఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 2019–20లో 37.6 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2.8 లక్షల కోట్లు) ఉన్న దేశీ ఐటీ–బీపీవో పరిశ్రమ 2025 నాటికి 55.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3.9 లక్షల కోట్లు)కు చేరగలదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఎయిర్‌సెల్ యూజర్లకు ఐడియా షాక్
న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ యూజర్లకు ఐడియా సెల్యులార్ షాకిచ్చింది. బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్‌తో ఉన్న ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని ఐడియా పేర్కొంది. ఎయిర్‌సెల్ ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు తాము ఈ సర్వీసులను అందజేయమని వెల్లడించింది. అయితే ఎంతమొత్తంలో ఎయిర్‌సెల్ బాకీ పడి ఉందో ఐడియా తెలుపలేదు. '' బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్ లిమిటెడ్‌తో మా ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నాం'' అని ఐడియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 నవంబర్ నుంచి పలుమార్లు ఈ బకాయిలు చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను కోరామని, కానీ ఆ ఆపరేటర్ బకాయిలు చెల్లించడంలో విఫలమైనట్టు పేర్కొంది. ఇంటర్‌కనెక్ట్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌సెల్ ఈ పేమెంట్లను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్‌సెల్ వెంటనే స్పందించలేదు. -
ఎయిర్‌టెల్‌వల్ల రోజుకు 2 కోట్ల కాల్‌డ్రాప్‌లు!
* తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను కల్పించకపోవడమే కారణం... * రిలయన్స్ జియో తాజా ఆరోపణ; ఖండించిన ఎయిర్టెల్ న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ల మధ్య ఇంటర్కనెక్షన్ వివాదం మరింతగా ముదురుతోంది. ఎయిర్టెల్ కస్టమర్లతో తమ మొబైల్ వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల(పీఓఐ)ను కల్పించకపోవడంవల్ల రోజుకు 2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. తమకు అవసరమైన పోర్ట్‌లలో నాలుగోవంతును మాత్రమే ఎయిర్టెల్ అందుబాటులో ఉంచిందని.. తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ, పోటీ కంపెనీలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. అయితే, జియో తాజా ఆరోపణలను ఎయిర్టెల్ ఖండిం చింది. అదనపు పీఓఐల విషయంలో జియో కావాలనే రాద్ధాంతం చేస్తోందని.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) విజ్ఞప్తులను అడ్డుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎంఎన్‌పీపై నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలిపింది. కాగా, ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను కల్పించేందుకు కఠినమైన షరతులను విధిస్తోందని.. దీనివల్ల అదనపు పోర్ట్‌లను వినియోగించుకోవడానికి వీలవడంలేదని జియో పేర్కొంది. మొబైల్ వినియోగదారులకు ఉచిత వాయిస్‌కాల్స్ ప్రయోజనాన్ని అందించాలన్న తమ ప్రయత్నాలకు గండికొట్టడంద్వారా ఎయిర్టెల్ గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు గుప్పించింది. రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్టెల్ ప్రకటించిన మర్నాడే జియో తాజా ఆరోపణలు చేయడం గమనార్హం. ప్రస్తుత టెలికం కంపెనీలు తమకు తగిన పీఓఐలను కల్పించకపోవడంవల్ల భారీగా కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు జియో ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై టెల్కోలు, జియో ప్రతినిధులతో ఇటీవలే ట్రాయ్ సంప్రదింపుల భేటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్లు... జియోకు అవసరమైన పీఓఐలు కల్పిస్తామంటూ ప్రకటించాయి కూడా.