ఎయిర్‌టెల్‌వల్ల రోజుకు 2 కోట్ల కాల్‌డ్రాప్‌లు!
* తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను కల్పించకపోవడమే కారణం...
* రిలయన్స్ జియో తాజా ఆరోపణ; ఖండించిన ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ల మధ్య ఇంటర్‌కనెక్షన్ వివాదం మరింతగా ముదురుతోంది. ఎయిర్‌టెల్ కస్టమర్లతో తమ మొబైల్ వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల(పీఓఐ)ను కల్పించకపోవడంవల్ల రోజుకు 2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. తమకు అవసరమైన పోర్ట్‌లలో నాలుగోవంతును మాత్రమే ఎయిర్‌టెల్ అందుబాటులో ఉంచిందని..
తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ, పోటీ కంపెనీలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. అయితే, జియో తాజా ఆరోపణలను ఎయిర్‌టెల్ ఖండిం చింది. అదనపు పీఓఐల విషయంలో జియో కావాలనే రాద్ధాంతం చేస్తోందని.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) విజ్ఞప్తులను అడ్డుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎంఎన్‌పీపై నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలిపింది. కాగా, ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను కల్పించేందుకు కఠినమైన షరతులను విధిస్తోందని.. దీనివల్ల అదనపు పోర్ట్‌లను వినియోగించుకోవడానికి వీలవడంలేదని జియో పేర్కొంది. మొబైల్ వినియోగదారులకు ఉచిత వాయిస్‌కాల్స్ ప్రయోజనాన్ని అందించాలన్న తమ ప్రయత్నాలకు గండికొట్టడంద్వారా ఎయిర్‌టెల్ గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు గుప్పించింది.
రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్‌టెల్ ప్రకటించిన మర్నాడే జియో తాజా ఆరోపణలు చేయడం గమనార్హం. ప్రస్తుత టెలికం కంపెనీలు తమకు తగిన పీఓఐలను కల్పించకపోవడంవల్ల భారీగా కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు జియో ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై టెల్కోలు, జియో ప్రతినిధులతో ఇటీవలే ట్రాయ్ సంప్రదింపుల భేటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌లు... జియోకు అవసరమైన పీఓఐలు కల్పిస్తామంటూ ప్రకటించాయి కూడా.