టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మరో డ్రగ్స్ ముఠా
♦ 180 గ్రాముల కొకైన్ స్వాధీనం
♦ మార్కెట్ విలువ రూ.10 లక్షల పైనే..: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ దందాకు కళ్లెం పడట్లేదు. హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో నగర వాసులతో పాటు నైజీరియన్ సైతం ఉన్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 180 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకు న్నట్లు తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. నైజీరియాలోని లాగోస్ ప్రాంతానికి చెందిన జాన్ బాస్కో గత ఏడాది జూన్‌లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చాడు. ముంబైలోని వసీ ప్రాంతంలో స్థిరపడిన ఇతను మాదక ద్రవ్యాల విక్రేతగా మారాడు. హైదరాబాద్‌తో పాటు మెట్రో నగరాల్లోని ఏజెంట్లకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తు న్నాడు. ఏపీలోని కాకినాడకు చెందిన మహ్మద్ జహరుల్లా మధురానగర్‌లో నివసిస్తున్నాడు.
కొకైన్‌కు బానిసైన ఇతను మరికొందరికి విక్రయించేవాడు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి జాన్ బాస్కో నుంచి కొకైన్‌ను కొని జహరుల్లా దాన్ని తన వినియోగదారులకు విక్రయిస్తున్నా డు. ఇటీవల జాన్‌ను సంప్రదించిన జహరుల్లా తనకు కొకైన్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. దీంతో జాన్ ఆదివారం నగరానికి చేరుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మధురానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కొకైన్‌తో పాటు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.