షెల్ కంపెనీలపై కఠిన చర్యలు
• బ్యాంకు ఖాతాల స్తంభన
• టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్ కోసం ఏర్పాటయ్యే డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఆయా సంస్థల ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు పలు కఠిన చర్యలు తీసుకోనుంది. షెల్ కంపెనీలపై శుక్రవారం సమీక్ష జరిపిన ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రెవెన్యూ విభాగం, కార్పొరేట్ వ్యవహారాల విభాగాల కార్యదర్శుల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఇతర శాఖలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు సభ్యులుగా ఉంటారు.
’దేశంలో 15 లక్షల కంపెనీలు నమోదై ఉండగా, కేవలం 6 లక్షల సంస్థలు మాత్రమే వార్షికంగా రిటర్నులు దాఖలు చేస్తున్నాయి. అంటే, చాలా పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయి’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే ఈ తరహా డొల్ల సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, కార్యకలాపాలు సాగించని సంస్థలను రద్దు చేయడం, బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం తదితర చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వృత్తి నిపుణులపై కూడా చర్యలు ఉంటాయని పీఎంవో తెలిపింది.
49 సంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐవో కేసులు..
గణాంకాల ప్రకారం 54 మంది ప్రొఫెషనల్స్‌తో 559 మంది దాదాపు రూ. 3,900 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలిందని పీఎంవో తెలిపింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) 49 షెల్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది.
డొల్ల సంస్థల తీరుతెన్నులు..
షెల్ కంపెనీల తీరుతెన్నుల గురించి పీఎంవో వివరించింది. నామమాత్రపు పెయిడప్ క్యాపిటల్, షేరుకు అధిక ప్రీమియం కారణంగా ఖాతాల్లో అధిక నిల్వలు.. మిగులు, అన్‌లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడులు, డివిడెండ్ ఆదాయం లేకపోవడం, అత్యధికంగా నగదు నిల్వలుండటం ఈ షెల్ కంపెనీల లక్షణాలని పేర్కొంది. అలాగే ప్రైవేట్ సంస్థలు మెజారిటీ వాటాదారులుగా ఉండటం, టర్నోవరు.. నిర్వహణ ఆదాయాలు తక్కువగా ఉండటం, నామమాత్రపు వ్యయాలు..చెల్లింపులు, అతి తక్కువ స్థిరాస్తులు మొదలైనవి కూడా ఇందులో ఉంటాయని వివరించింది.