
పట్టుబడిన బంగారాన్ని చూపుతున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు రోజుకో పంథాలో తమ దందా కొనసాగిస్తున్నారు. పలు రూపాల్లో పసిడిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా ఒకేరోజు ఛేదించిన రెండు కేసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు హైదరాబాదీయుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మొత్తం రూ.1.17 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేసిన కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి బుధవారం వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి సయ్యద్ అబ్దుల్ హైతమీన్‌కు షార్జాలో ఉంటున్న సయ్యద్ అఫ్జల్ హుస్సేన్‌తో పరిచయం ఏర్పడింది. హుస్సేన్ గతంలో డ్రైవర్‌గా పని చేసి ప్రస్తుతం బంగారం స్మగ్లర్‌గా మారిపోయాడు.
హైతమీన్‌ను క్యారియర్‌గా మార్చి స్మగ్లింగ్‌కు శ్రీకారం చుట్టాడు. గత నెల్లో షార్జా వెళ్లిన హైతమీన్ అక్కడ అఫ్జల్ సహకారంతో కొన్ని ప్రత్యేక దుకాణాల్లో 550 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చాడు. సీల్డ్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న దీన్ని రెండు యాంకిల్ బ్యాండ్స్‌లో ఏర్పాటు చేయించుకున్నాడు. వీటిని రెండు కాళ్లకు అమర్చుకుని, వాటిపై సాక్సు వేసుకుని షూ ధరించి గత శనివారం సిటీకి వచ్చాడు. గిన్నెలో వేసి వేడి చేస్తే చాలు పసిడి య«థాతథంగా బయటపడుతోంది. కనీసం గ్రాము కూడా తరుగు ఉండదు. బంగారం రూపు మార్చడానికి ఆ దుకాణాలవారు రూ.16 వేలు (భారత కరెన్సీలో) చార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్‌ఐలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుల్ బి.ప్రవీణ్ బుధవారం హైతమీన్ ఇంటిపై దాడి చేశారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారం, పాస్‌పోర్ట్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బంగారం విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అఫ్జల్‌కు పంపిస్తానని, తనకు ఒక్కో ట్రిక్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇస్తుంటాడని హైతమీన్ పేర్కొన్నాడు.
కస్టమ్స్‌కు చిక్కిన మరో క్యారియర్...
నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన ఆయన తనతోపాటు నాలుగు ట్రాలీ బ్యాగ్స్ తీసుకువచ్చారు. అతడి వ్యవహారశైలితోపాటు బ్యాగులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) ఆపి తనిఖీలు చేసింది. అతడి వద్ద, బ్యాగుల్లోనూ అనుమానిత వస్తువులు లభించలేదు. అయితే అతడు నాలుగు బ్యాగుల్ని పట్టుకు రావడంపై కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు. దీంతో వాటిని అణువణువూ తనిఖీ చేశారు. ఆ ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలు తదితరాలన్నీ బంగారంతోనే తయారైనట్లు గుర్తించారు. దుబాయ్‌లో మూడు కిలోల బంగారం ఖరీదు చేసిన సూత్రధారులు దాన్ని కొందరి సాయంతో ఇలాంటి వస్తువులుగా మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం కోటింగ్స్ వేశారు. వీటిని ఆయా ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న వాటితో రీప్లేస్ చేశారు. ఈ బ్యాగుల్ని తీసుకువస్తూ నగరవాసి కస్టమ్స్‌కు చిక్కాడు. ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలను వేరు చేసి తూకం వేయగా మూడు కేజీల బంగారం ఉన్నట్లు తేలింది. దీని ధర లోకల్ మార్కెట్‌లో రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకువచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment