సాక్షి, హైదరాబాద్: నగర రహదారుల కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ప్రస్తుతం నగర రోడ్లను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు సూచించడంతో పాటు, రోడ్ల మరమ్మతులు, నూతన ప్రాజెక్టులను ఈ టాస్క్‌ఫొర్స్ సమన్వయం చేస్తుందన్నారు.
నగర రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ జలమండలిలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ సిబ్బంది కొరత తీర్చడంతోపాటు, నిధులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం, బ్యాంకుల నుంచి రుణాల సేకరణ వంటి అన్ని ఏర్పాట్లు నగర రోడ్ల కోసం చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రహదారుల కోసం ఖర్చు చేయనున్న నేపథ్యంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్‌లో పురపాలక శాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైల్, టీఎస్‌ఐఐసీ ఎండీలు, నగర చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ), జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల సీఈలు సభ్యులుగా ఉంటారన్నారు. నగరంలో భారీ వర్షాలకు పాడయిన రోడ్లను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రూ.77 కోట్లతో మరమ్మతులు ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ వర్షాకాలంలో నీళ్లు నిలిచి, ట్రాఫిక్ జామ్‌కు కారణమైన సుమారు 350 రోడ్ పాయింట్లను అధికారులు గుర్తించారని, ఈ ప్రాంతాల్లో వైట్ టాపింగ్ రోడ్లు వేసేందుకు రూ.130 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలన్నారు.
డివిజన్‌కు ఒక ఇంజనీర్..
దీంతో పాటు నగరంలోని రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చేపట్టిన పలు ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్న పనుల తాలూకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, వాటికి వెంటనే టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సార్డీపీ ద్వారా వచ్చే ఏడాదిలోగా సుమారు రూ.వెయ్యి కోట్ల పనులు పూర్తవుతాయని, వీటితో ప్రస్తుతం రద్దీగా ఉన్న పదుల సంఖ్యలోని కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరమవుతాయని చెప్పారు. రోడ్ల నిర్వహణకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి వినూత్న విధానాలు పాటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 50 మంది ఇంజనీర్లు రోడ్ల నిర్వహణను పర్యవేక్షించేవారని, ఇకపై డివిజన్‌కు ఒకరు చొప్పున 150 మంది ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా 150 మంది ప్రత్యేకంగా రోడ్లపైనే పనిచేస్తారని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment