
వాడి విడిచిన దుస్తులకు అతుకులు వేయడం. వేకువజామున నమాజ్‌కు వెళ్లే వేళ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి దానం చేయడం. తండ్రి చేస్తున్న ఈ సేవ నా మనసులో ముద్రవేసుకుపోయింది. ఆయన స్వేదంతో కష్టిస్తూనే నేను డిగ్రీ పూర్తి చేశాను. ఆ తరువాత వివాహం. అంతే నా మనసు అంతరాల్లో ఉన్న మాధవసేవకు పుల్‌స్టాప్ పడిందనుకున్నా. భర్తతో చెబితే కాదనకుండా భుజం తట్టి ప్రోత్సహించారు. పీజీ చేశా. అదే స్ఫూర్తితో సైకాలజీ, ప్రత్యేక ప్రతిభావంతులపై పీహెచ్‌డీ చేసి బంగారు పతకం సాధించా. ఆ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా నాలో ఏదో వెలితి. రెండేళ్లలోనే ఉద్యోగానికి రాజీనామా చేశా. అమెరికాలో ఉన్న నా స్నేహితులు నన్ను అక్కడికే పిలిపించుకోవాలనే చూశారు. డాలర్స్‌పై నాకు డ్రీమ్స్ లేవనే చెప్పాను. సమయం రానే వచ్చింది. శారీరక, మానసిక వికలాంగులనే చేరదీసి వారికి అమ్మను అయ్యాను. వారి సేవలో ఉన్న సంతప్తి మరెక్కడా లేదని అభయ క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎస్‌ఏ.తస్లీమ్ తన భావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
దిగాలు అనిపించింది...
డిగ్రీ తరువాత రైల్వే ఉద్యోగి సయ్యద్ లతీఫ్‌తో వివాహం జరిగింది. మా చిన్ననాటి నుంచి నాన్న చేసిన సేవలు మదిలో మెదలగానే సేవ చేయాలనే ఆలోచనకు పులుస్టాప్ పడిందని అనిపించింది. కొంతకాలం తరువాత చదువుకోవాలనే నా కోరికను గౌరవించిన నా భర్త లతీఫ్ ప్రోత్సాహంతో చిన్న పనులు చేస్తూనే సైకాలజీలో పీజీ చేశా. ప్రపంచంలోని అసాధారణ ప్రతిభావంతులపై చేసిన పీహెచ్‌డీకి బంగారు పతకం వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నేనే ఎస్‌వీయూలో ఫస్ట్ ర్యాంక్ సాధించా.
డాలర్‌డ్రీమ్స్..
డిగ్రీ నుంచి నాతో కలిసి చదువుకున్న అమ్మాయిల్లో నా స్నేహితులు దాదాపు 20 మంది వరకు అమెరికాలో ఉన్నారు. ‘నీ తెలివికి, ప్రతిభకు ఇక్కడ ఊహించని జీతం వస్తుంది’ అని డాలర్లపై మోజు పెంచుతూ అనేక విధాలుగా చెప్పారు. డబ్బు సంపాదనకు అమెరికా వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి కూడా సంపాదించవచ్చు. కానీ నా ఆలోచన వేరు. నాన్న కష్టాల్లో అడుగులు వేయిస్తే, భర్త నడక నేర్పించారు. వారి కష్టం, ప్రోత్సాహం సార్థకం చేయాలనేది నా ముందున్న కర్తవ్యం. ఆ క్రమంలో నా ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలని తర్జనభర్జనల్లో ఉండగానే, డిప్యూటీ డీఈఓగా డిపెప్‌లో వరంగల్ జల్లా హసన్‌పర్తిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ రెండేళ్లు ఉద్యోగం చేశా. కానీ ప్రభుత్వ పరంగా లక్ష్యాలు సాధించడం, జీతం తీసుకోవడం ఇదేమీ నన్ను సంతృప్తి పరచలేదు. అంతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశా.
స్వచ్ఛంద సేవలు..
మానసిక, శారీరక వికలాంగుల సేవే మాధవ సేవగా నేను భావించా. నాకున్న అవగాహన, అనుభవం మేళవించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో సేవలు అందించా. ఇక్కడ నేనేమీ ఆశించలేదు. తీసుకోలేదు. సొంతంగా 2003 ఆగస్టు 26వ తేదీ మదర్‌థెరిస్సా పుట్టిన రోజున రేణిగుంటలో అభయ క్షేత్రం ప్రారంభించారు. మానసిక, శారీరక వికలాంగులకు ఇది పునరావాస కేం ద్రం. ముగ్గురితో ప్రారంభించా. ఆ సంఖ్య ప్రస్తుతం 176కు చేరింది. ఎందరో అభాగ్యుల కు ఆశ్రయం ఇవ్వడం, వారికి సేవలు చేయడం ద్వారా ఉన్నత వర్గాలనే కాదు.. పేద మధ్య తరగతి వారిని కూడా కదిలించింది. ఎవరికి తోచిన రీతిలో వారు ఇక్కడ ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సాయం అందిస్తున్నారు.
మా కుటుంబీకులూ మమేకం..
వీధిలో వారిని మెప్పించే ముందు ఇంట్లో వారిని కూడా సంతప్తిపరచాలి. ఇది అక్షరాలా సత్యం చేశాననే సంతప్తి నాకు ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన విషయం మీకు చెబుతా. మా పెద్ద అక్క రజియా కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. ఆమె కుమార్తె వివాహానికి ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు ఇక్కడ నా వారందరినీ వదిలి వెళ్లి రాలేనని చెప్పా. ఇందుకు వారు కూడా నిజమే అన్నారు. పెళ్లి పేరుకే అక్కడ నిర్వహించి, రిసెప్షన్ మాత్రం అభయ క్షేత్రంలోని ప్రతిభావంతుల మధ్య నిర్వహించారు. నా కుటుంబ సభ్యులు, అమెరికాలో ఉన్న స్నేహితులను కూడా మెప్పించా. వారందరూ ఏదో ఒక రూపంలో సాయం అందిస్తూనే ఉన్నారు.
మానాన్న అజీస్ టైలర్. అమ్మ ప్యారుబీ గృహిణి. రేణిగుంటలో మాది మధ్య తరగతి ముస్లిం కుటుంబం. ఆరుగురం అన్న, తమ్ముడు, అక్కాచెల్లెళ్లం. అన్న మహబూబ్‌బాషా ఇప్పుడు లేరు. రజియా,షాహినా, ముంతాజ్, నేను ఆ తరువాత తమ్ముడు మస్తాన్. మా అందరినీ నాన్న దర్జీ పని చేస్తూనే చదివించారు. అందరూ ఇంటర్, ఆ లోపు చదువుకే పరిమితమయ్యారు. కుమార్తెల్లో నేను చిన్నదాన్ని కావడంతో కాస్త ఎక్కువగానే గారాబం చూపారు. రూ.50 రైలు పాసుతో తిరుపతిలో బీఏ చదివాను. చదువుపై ఉన్న కష్టాలు పెద్దగా బాధించలేదు. ఎందుకంటే మా పరిస్థితి తెలుసు.
మా పిల్లలు కూడా..
ఒక విషయం మాత్రం స్పష్టం సార్.. మా కుటుంబానికి పరదాలతో బంధనాలు వేయలేదు. చదువు, సేవలో మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబంలో పడిన కష్టాలు మరిచిపోలేదు. లతీఫ్‌తో నాకు వివాహం అయిన పదేళ్ల వరకు పిల్లలు లేరు. చదువు. ఉద్యోగం. స్వచ్ఛంద సంస్థల్లో సేవలతో కాలం సాగదీశాం. మాకు ఒక కుమారుడు ఉమర్ (9వ తరగతి), కుమార్తె రూబి(ఇంటర్) చదువుతున్నారు. వారిద్దరినీ అభయక్షేత్రంలోని పిల్లల సేవలో మమేకం చేస్తుంటాం. ఎందుకంటే పిల్లలకు ఉగ్గుపాలతో ఏది నేర్పినా, మనసులో ఉండిపోతుందని నమ్ముతాను కాబట్టే. నా తమ్ముడు మస్తాన్ కూడా ఇదే క్షేత్రంలో సేవల్లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment