విజయనగరం గంటస్తంభం: వారికేం ప్రభుత్వ ఉద్యోగం.. ఆఫీస్‌కు ఇలా వెళ్లి అలా వచ్చేస్తే చాలు... నెలయ్యేసరికి జీతం బ్యాంకు ఖాతాలో పడుతుంది.. ఇదీ సాధారణ జనాల్లో ఉద్యోగులపై ఉన్న భావన. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తీసుకున్నది జీతమే అయినా పగలు, రాత్రనకు పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు వెళ్తే రాత్రి 10 గంటలైనా ఇంటికి చేరలేకపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబ జీవనం గతి తప్పి సతమతమవుతున్నారు.
సెలవు రోజూ విధులు..!
మూడేళ్లగా ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వరుసగా ఏదో ఒక పని చెప్పడం, లక్ష్యాలు నిర్వేశించి పని చేయాలని ఆదేశించడం, గడువులు విధించడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చి నెలాఖరులోగా ప్రటించాలని ప్రభుత్వం లక్ష్యం విధించడం, కలెక్టర్ అంతకంటే ముందే డిసెంబర్ నాటికి చేయాలని అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తేవడంతో అధికారులు సెలవులు, పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారు. ఓ విధొంగా చెప్పాలంటే చేయడం లేదు... అధికారులే చేయిస్తున్నారు. ఆదివారం సెలవు దినమని అందరికీ తెలిసిన విషయమేనైనా ఉదయం టెలికాన్ఫరెన్స్, సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్సు పెట్టడంతో మండల స్థాయి అధికారులు మండలాల్లో గడాపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకరోజూ లక్ష్యాలపై నివేదికలు కోరడంతో పగలంతా గ్రామాల్లో ఉంటున్న అధికారులు రాత్రిపూట నివేదికలు, సాధారణ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 9, 10 గంటల వరకు ఇంటికి చేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులు, సిబ్బందికి సైతం సమయంలో మినహాయింపు లేదు. ప్రస్తుతం గృహనిర్మాణశాఖ అధికారులకు కూడా లక్ష్యాలు విధించడంతో పరుగులు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ, వెలుగు శాఖల సిబ్బంది పని ఒత్తిడితో నలిగిపోతున్నారు.
ఈ ప్రభుత్వంలో ఇంతే..!
తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు సుఖముండదు. ఇదీ సాధారణంగా ఉద్యోగుల్లో నెలకొన్న భావన. 2004కు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఇలాగే రాత్రి పగలు పని చేయించారు. ఫలితంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాస్త సేద తీరారు. అలాగని వారి హయాంలో కూడా ఒత్తిడి లేదని చెప్పలేం. అయితే, అది సాయంత్రం వరకు పని వేళలకు పరిమితమయ్యేది. అయితే, ఏడాదిలో ఎప్పుడో వారం పదిరోజులు మాత్రమే రాత్రి వరకు పని చేయాల్సి వచ్చేది. దీంతో అప్పట్లో ఉద్యోగుల్లో ఇంత వ్యతిరేకత లేదు. అయితే 2014లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కంటే సర్వేలు ఎక్కువ కావడం, పూటకో నివేదిక కోరడం పరిపాటిగా మారింది. అంతా క్షణాలు, రోజులు, నెలల్లో అయిపోవాలని భావించడంతో భారం ఉద్యోగులపై పడుతుంది.
తీవ్ర ఆవేదన...
ప్రభుత్వం, ఉన్నతాధికారులు వైఖరిపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల విషయంలో టార్చర్ అనుభవిస్తున్నామని ఒక ఎమ్పీడీవో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఉద్యోగులు పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మూడురోజుల కిందట కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ నిరసన తెలిపారు. వ్యవస్థను చూసి బాధగా ఉందని, ఇదేం వ్యవస్థ అని ఒక ఇంజినీరింగ్ అధికారి నిట్టూర్చడం విశేషం. ఇకపోతే అందరూ ఉద్యోగులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాలు విధించడంతో తమ కుటుంబాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కొంచెం ఆలోచించి ప్రభుత్వం విధించిన సమయాల్లో పని చేయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment