రాయవరం : వేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏది కోరుకుంటారని చదువుకున్న వారిని అడిగితే..ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ప్రతి ఒక్కరూ ఠక్కున సమాధానమిస్తారు. మంచి జీతం, పదవీ విరమణ తర్వాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులైనా అందరికీ సమానమైన పింఛన్ విధానం అమలు కావడం లేదు. ఇది ఒక రకంగా ఉద్యోగుల మధ్య అంతరానికి దారితీస్తోందని చెప్పవచ్చు. ప్రభుత్వాలపైనా వ్యతిరేకతను పెంచుతుంది. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానంతో పింఛన్ వస్తుందన్న నమ్మకాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారు.
దీనిపై సీపీఎస్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ అంశమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన అజెండాగా మారనుంది.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ..
2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. పథకాన్ని పీఎఫ్‌ఆర్డీ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్‌మెంట్ అథారిటీ), ఎన్‌ఎస్‌డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూల వేతనం, కరువుభత్యంలో పింఛన్ కోసం మినహాయించిన పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలొస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 14,457 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సుమారు ఏడు వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటుతో ఒక గొడుగు కిందకు వచ్చారు. వీరంతా లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నారు. వీరికి బాసటగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి.
ఉద్యోగులకు నష్టమిలా ..
పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగులు గ్రాడ్యుటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్‌లో కొంత భాగాన్ని కముటేషన్ చే సుకునే అవకాశం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛను వచ్చే సదుపాయం పాత విధానంలో ఉండగా, కొత్తగా లేదు.
వృద్ధాప్యంలో అభద్రత
పార్లమెంట్‌లో పీఎఫ్‌ఆర్డీ బిల్లును ఇటీవలే ఆమోదించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం ఉండదు. దీని వల్ల సామాజిక భద్రత లేకుండా పోతోంది. 30 ఏళ్లు సర్వీసు ఉన్నా పింఛను లేక పోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవు.
- కె.మునిప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నేత, కరప
పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి..
పింఛన్ విధానాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. కొత్త పింఛన్ విధానంలోకి వచ్చిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా మళ్లీ పాత విధానంలోకి వెళ్లేందుకు యోచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్
విధానాన్ని అమలు చేయాలి.
- దొంతంశెట్టి సతీష్, టీచర్, మాచవరం, రాయవరం మండలం
ఇదెక్కడి పింఛన్ విధానం!
Published Tue, Mar 8 2016 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement