సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నవారంతా మొదట ఉపాధ్యాయ వృత్తిపైనే దృష్టి పెడుతుంటారు. రెండు పదుల వయస్సు నిండక ముందే సర్కారు కొలువులో స్థిరపడవచ్చన్నది వీరి ఆశ. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇటీవలి కాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో ఆ స్థాయి బోధన జరగడం లేదు. ఇంటర్ పూర్తిచేసి కొండంత ఆశతో డీఎడ్ కోర్సులో చేరిన విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. పరీక్షల సమయం ముంచుకొచ్చినా సగానికిపైగా సిలబస్ పెండింగ్‌లో పెట్టి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.
రాయచోటి డైట్ మినహాయిస్తే జిల్లాలో ప్రస్తుతం 49 ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు నడుస్తున్నాయి. ఒక్క కడప పట్టణంలోనే 12 కళాశాలలు ఉండగా, ప్రొద్దుటూరులో 9, రాజంపేటలో 8, రైల్వేకోడూరులో 4, రాయచోటి, బద్వేలు ప్రాంతాల్లో ఆరేసి ఉన్నాయి. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో ఒక్కొక్క కాలేజీ ఉంది. వీటిల్లో సగానికి పైగా కళాశాలలు 2012-13 విద్యా సంవత్సరం నుంచే పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం బీఎడ్ విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు.
అసలు సమస్య ఇక్కడే.. :
2012-13 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి అనుమతి పొందిన డీఎడ్ కళాశాలలు, తగిన ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఉండటంతో నామమాత్రపు అధ్యాపకులతో తూతూ మంత్రంగా తరగతులు నిర్వహించారు. వాస్తవానికి డీఎడ్ సబ్జెక్టులను బోధించడానికి ఎంఎడ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అయితే బీఈడీ లేదా సాధారణ పీజీ చేసిన వారితో పాఠాలు చెప్పించి మమ అనిపిస్తున్నారు.
అన్నింటా నిర్లక్ష్యం :
2012 డైట్ సెట్ నిర్వహణ ఆది నుంచి ఆలస్యం కావడం, కౌన్సిలింగ్‌లో మరింత జాప్యం జరగడంతో మొదటి సంవత్సరం తరగతులు మొదలయ్యేసరికి 2013 ఫిబ్రవరి వచ్చేసింది. ఈ ఏడాది వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని ఆయా కళాశాలలకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. పేరుకు మాత్రం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆ స్థాయిలో విద్యాబోధన చేయలేకపోయాయి. చాలా కాలేజీల్లో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడంతో ఒకట్రెండు పీరియడ్లలో మాత్రమే బోధన జరిగేది. దీంతో జులై చివరి నాటికి సగం కూడా సిలబస్ పూర్తి చేయలేకపోయారు. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం... విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనడంతో బోధన ముందుకు సాగలేదు.
నవంబర్‌లో పరీక్షలు :
డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు త్వరలో తేదీలు ఖరారయ్యే అవకాశముంది. బహుశా నవంబర్ మూడవ వారంలో ఉండవచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు తత్వశాస్త్రం, విద్య మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రాథమిక విద్య, సమ్మిళిత విద్య, సామర్థ్య నిర్మాణం... అనే ఐదు పరీక్షలను రాయాల్సివుంది. కడప పట్టణంలోని ఓ పేరొందిన కళాశాలలో ఇప్పటివరకు ప్రాథమిక విద్య, సమ్మిళిత విద్య సబ్జెక్టులను అస్సలు మొదలుపెట్టలేదు. మిగిలిన మూడు సబ్జెక్టులు కూడా సగంలో ఆగిపోయాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే ఇక మండల కేంద్రాల్లోని కళాశాలల్లో విద్యాబోధన ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..? :
డీఎడ్ కళాశాలల్లో తరగతులు ఎలా జరుగుతున్నాయి? అర్హులైన అధ్యాపకులున్నారా? సిలబస్ సకాలంలో పూర్తవుతున్నదా? తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విద్యాశాఖ అధికారులు కళాశాలల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. కళాశాల యాజమాన్యాలు సంపాదనే పరమావధిగా భావించి భావి ఉపాధ్యాయుల భవితను మంటగలుపుతున్నారన్నది నిర్వివాదాంశం. ఉపాధ్యాయ శిక్షణలోనే ఇంతటి నిర్లక్ష్యాన్ని చవిచూస్తున్న భావి అయ్యవార్లు ప్రభుత్వ కొలువుల్లోకి వెళితే ఏ మేరకు పాఠాలు చెబుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయోమయం
Published Mon, Oct 28 2013 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement