
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి లక్ష్యం. కానీ, సాధించేది కొందరే! నిరంతర అభ్యసనం, అదృష్టం రెండూ ఉంటే తప్ప అవి దరిచేరవు. అలాంటిది పాకెట్ మనీ ఖర్చు చేసినంత సులువుగా గవర్నమెంట్ జాబ్‌ను సాధించేలా చేస్తుంది అడ్డా 247. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో 35 వేలకు పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల బాట వేసింది. మరిన్ని వివరాలు కో–ఫౌండర్ అనిల్ నగర్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
మాది ఉత్తర్ ప్రదేశ్‌లోని ధన్‌కౌర్ అనే కుగ్రామం. ఐఐటీ చదవాలన్నది నా కల. కానీ, మా గ్రామంలో సరైన శిక్షణ సంస్థలు, గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేరు. దీంతో చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా ఐఐటీలో సీటు సంపాదించాలని ఢిల్లీకి వెళ్లి కోచింగ్ సెంటర్‌లో చేరా. ఫలితంగా 1988లో వెయ్యి ర్యాంక్‌తో ఐఐటీ బనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో చేరా. చదువుతున్న సమయంలో నాకర్థమైనదేంటంటే.. ఉన్నత చదువు కోసం నాలా చాలా మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మెట్రో నగరాలకు వలస వస్తున్నారని! దీనికి పరిష్కారం చూపించేందుకే 2010లో మరొక స్నేహితుడు సౌరభ్ భన్సల్‌తో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్ కెరీర్ పవర్‌ను ప్రారంభించా. 2016లో దీన్ని అడ్డా 247గా పేరు మార్చి ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టాం.
త్వరలో యూపీఎస్‌సీ, సీటీఈటీ, ఎన్‌డీఏ
ప్రస్తుతం అడ్డా 247లో బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) రెండు రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షల్లో శిక్షణ అందిస్తుంది. వీడియో కోర్సులు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు, ఈ–పుస్తకాలు, ప్రాక్టీస్ మెటీరియల్స్, సందేహాల నివృత్తి వంటి 360 డిగ్రీల్లో సేవలందిస్తుంది. వీటి ధరలు రూ.400 నుంచి రూ.12 వేల వరకుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి సెంట్రల్ యూపీఎస్‌సీ, టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటీఈటీ), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్షల సిలబస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 60 ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్లున్నాయి.
30 కోట్ల వీడియో క్లాస్‌లు..
ప్రస్తుతం అడ్డా 247లో 4 కోట్ల మంది యూజర్లున్నారు. ఇందులో 4 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఇప్పటివరకు 30 కోట్ల వీడియో క్లాస్‌లు, 1380 కోట్ల మాక్ టెస్ట్‌లను నిర్వహించాం. రోజుకు 50 లక్షల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల మంది పెయిడ్ యూజర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఇప్పటివరకు 35 వేల మందికి పైగా అభ్యర్థులు వివిధ ప్రభుత్వ పరీక్షల్లో ఎంపికయ్యారు.
హైదరాబాద్ టాప్..
భౌతిక కోచింగ్ సెంటర్లలో 25–26 శాతం మార్జిన్లు ఉంటే.. ఆన్‌లైన్ కోచింగ్‌తో 50 శాతం వరకు మార్జిన్లుంటాయి. మా మొత్తం యూజర్లు, వ్యాపారంలో హైదరాబాద్ టాప్‌లో ఉంది. ఇక్కడి నుంచి 37 లక్షల మంది యూజర్లున్నారు. మా మొత్తం ఆదాయంలో 10 శాతం వాటా నగరానిది. ఆ తర్వాత పాట్నా,
ఢిల్లీ, లక్నోలది.
ఐదేళ్లలో రూ.1,000
కోట్లకు..
మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.51 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. 2019–20 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.100 కోట్లకు, వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ‘‘ప్రస్తుతం
మా కంపెనీలో 250 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలోనే పెట్టుబడులను పొందనున్నాం. ఒకట్రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని’’ అనిల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment