న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం.
పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్‌మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment