
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ ఉద్యోగమంటేనే భద్రత. పింఛన్ వారికొక భరోసా. కానీ 2004 నుంచి అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ శాపంగా మారింది. ఇప్పుడా స్కీమ్‌పై ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. నూతన సంస్కరణలని చెప్పి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాసి, సామాజిక భద్రతను హరించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని గొంతెత్తి అరిచినా పాలకులు పట్టించుకోవడం లేదు. దానిపై రోడ్డెక్కితే అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యోగుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులకు బాసటగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాసటగా నిలిచారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉద్యోగుల కష్టాలను కళ్లారా చూసి, వారి జీవితాలను చీకటి మయం చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఆశలు రేకెత్తించారు. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఒక్కటే ఆందోళన. ఎక్కడికెళ్లినా అదే చర్చ. ఎవరిని కదిపినా అదే ఆవేదన. ఉద్యోగులకు అశనిపాతంగా మారిన సీపీఎస్ విధానాన్ని తలుచుకుని గుబులు చెందుతున్నారు. తమను రోడ్డున పడేసేలా ఉందని గోడు వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ (సీపీఎస్) గుర్తు చేసుకుని మానసిక అశాంతికి లోనవుతున్నారు.
పాత విధానమే మేలు...
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కోసం పింఛన్‌ను ఒక హక్కుగా 1982లో న్యాయస్థానం కల్పించింది. దీని ద్వారా సంక్రమించిన పాత పింఛన్ విధానంలో అయితే ఉద్యోగి నుంచి నెల వేతనంలో పైసా చెల్లించనక్కర్లేదు. ఉద్యోగి చివరి నెల వేతనానికి అనుగుణంగా ముందుగానే స్పష్టత వస్తుంది. కనీసం రూ. 6500లకు తక్కువ కాకుండా ఏడేళ్ల సర్వీసులో ఉన్న ఉద్యోగికి 30 శాతం, దాటిన వారికి 50 శాతం వేతనంలో ఉంటుంది.
మొండికేస్తున్న సర్కార్
సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలు ఆ మధ్య పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాక తలొగ్గినట్టు ప్రభుత్వం కనిపించింది. చనిపోయిన సీసీఎస్ ఉద్యోగి వారసులకు ఫ్యామిలీ పింఛన్ ఇస్తామన్న జీవోను 2017జూలైలో విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగి చనిపోయేంతవరకూ సేకరించిన సొమ్ముకు అంతే మొత్తం ప్రభుత్వం కలిపి ఆ మొత్తానికి పింఛన్ బీమా రూపంలో వేసి పింఛన్ ఇస్తామని చెప్పుకొచ్చింది. ఇది అకాల సమయంలో చనిపోయిన సీసీఎస్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. . అయితే ఈ జీవో విడుదలై నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సరికదా కనీసం విధి విధానాల రూపకల్పన చేయలేదు. దీనివల్ల ఇంతవరకూ చనిపోయిన సిబ్బంది కుటుంబాల జీవితాలు దుర్బరంగా మారాయి. నిజానికి తిరిగి పాత పద్దతిని తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. మధ్యప్రదేశ్ ప్రభ్వుం ఇటీవల సీసీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేసింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోవడం లేదు.
ఉద్యోగులకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ ప్రకటన
సీపీఎస్ విధానంతో కుంగిపోతున్న ఉద్యోగులకు నేనున్నానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని పాదయాత్ర ప్రారంభంలోనే ప్రకటించారు. దీంతో ఉద్యోగ వర్గాలకు కాసింత ధీమా చేకూరినట్టయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయనా ప్రతిపక్ష నేత స్పందించి, తమకు అండగా నిలిచారని ఉపసమనం పొందారు. ఉద్యోగ సంఘాలన్నీ జగన్ ప్రకటనకు హర్షం వ్యక్తం చేశాయి.
సీపీఎస్ అంటే...
నూతన సంస్కరణల పేరిట 2004 జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో 2004 నుంచి నియమితులైన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగి తన బేసిక్, డీఏల్లో 10 శాతం చొప్పున ప్రతి నెలా తమ వాటాగా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో 10శాతం జమ చేస్తుంది. పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ దీన్ని అమలు చేస్తుండగా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ రికార్డుల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఉద్యోగి వాటా, ప్రభుత్వం వాటా కలిపి పింఛన్ బీమా పేరుతో షేర్ మార్కెట్‌లో పెడతారు. రిటైర్ అయిన సమయంలో మార్కెట్ విలువ, సంబంధిత పింఛన్ బీమా నిబంధనల మేరకు పింఛన్ వర్తిస్తుంది.
సీపీఎస్‌తో నష్టాలు
షేర్ మార్కెట్ ఒడిదొడుకులపైనే పింఛన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. నిర్ణీత మొత్తంలో పింఛన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లు దెబ్బతింటే, వచ్చే పింఛన్ తగ్గిపోతుంది. ఒక్కోసారి అసలేమీ రాకపోవచ్చు. అంటే ఉద్యోగికి పింఛన్ ఎంత మొత్తం వస్తుందో రిటైరైన తర్వాతే తెలుస్తుంది. మధ్యలో అకాల మరణం చెందిన వారి వారసులకు అప్పటికి షేర్ మార్కెట్‌లో పెట్టిన తక్కువ మొత్తం పింఛన్ బీమా పద్ధతిలో వస్తుంది. చనిపోయిన సీపీఎస్ ఉద్యోగి వారసులకు కారణ్య ఉద్యోగాలు గాని, పింఛన్లు గాని ఇవ్వడం లేదు. ఒకవేళ పింఛన్‌దారుడు చనిపోతే అతనిపై ఆధారపడ్డ భార్య, పెళ్లికాని ఆడపిల్ల, 25 ఏళ్లు నిండని నిరుద్యోగి కుమారుడికి ఎటువంటి పింఛన్ రాదు. అంటే పింఛన్‌దారుడు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండదు. పింఛన్‌తోపాటు గ్రాట్యూటీ రద్దు చేయడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగుల జీవితానికి భద్రత కూడా కొరవడుతుంది. ఈరకంగా రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు లక్షా 73 వేల మంది ఉండగా జిల్లాలోని అన్ని శాఖలు కలుపుకుని 16400 మంది ఉన్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు బాధితులే. 2004 నుంచి అమలవుతున్న సీపీఎస్ విధానంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 223 మంది అకాల మరణం చెందారు. వీరిలో జిల్లాకు చెందినవారు ఆరుగురు ఉన్నారు.
ఆ కుటుంబానికి ఆధారమేదీ?
కాకినాడ జగన్నాథపురంలో నివశిస్తున్న సింగిరెడ్డి కమలాదేవి 2016 డీఎస్సీలో ఉద్యోగం సంపాదించింది. ఏడాది తిరగకుండానే ఆమెను కామెర్ల వ్యాధి బలితీసుకుంది. చదువులో బాగారాణిస్తూ ఎంఏబీఈడీ చేసిన ఆమె వివాహం కాకుండానే ఉద్యోగం వచ్చిన ఏడాది తిరగకుండా మరణించడంతో ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. మరణించిన తరువాత రావల్సిన పింఛన్‌గానీ, గ్రాట్యుటీ గానీ, ఇతర సదుపాయాలు కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా దక్కలేదు. ఆమెనే నమ్ముకున్న తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ ఆవూరి చిన్నమ్మ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సీపీఎస్ పరిధిలోకి రావడంవల్లే ఆమె కుటుంబం ఎలాంటి ప్రభుత్వపరమైన ప్రతిఫలాలను అందుకోలేకపోయింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘం మాత్రం రూ.20 వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేసింది.
అండగా ఉంటాడనుకున్నారు...
కష్టపడి చదివించి ప్రయోజకుణ్ని చేశారు. ఉద్యోగంలో స్థిరపడి కష్టాలను తీర్చి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఉప్పలగుప్తం మండలం మునిపల్లి గ్రామానికి చెందిన దోనిపాటి మిలింద్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్‌గా చేస్తూ రోడ్డు ప్రమాదంలో గత ఏడాది జూన్ 29న మృతి చెందాడు. 2011 తరువాత ఉద్యోగంలో చేరిన మిలింద్‌కుమార్ నాలుగేళ్లకే ప్రమాదం బారినపడి మృతి చెందాడు. సీపీఎస్ విధానం ఫలితంగా మిలింద్ కుమార్ కుటుంబానికి రావల్సిన రాయతీలు అందకుండా పోయాయి. తల్లిదండ్రులు అనంతలక్ష్మి, సత్యనారాయణతోపాటు భార్య శిరీషలు ఆధారం కోల్పోయారు. కూలీ పని చేసుకుంటూ జీవించే అనంతలక్ష్మి, సత్యనారాయణలు అందివచ్చిన కొడుకు తమ కష్టాలు తీరుస్తాడనుకున్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. ఈ విధానాన్ని పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలు అమలు చేయడంలేదు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు. ప్రస్తుత సీపీఎస్ విధానం వల్ల ప్రస్తుతం ప్రతి ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ. 5 నుంచి 6 వేలు వరకు తీసుకుంటున్నారు. మా సొమ్మునే తిరిగి మాకు ఇస్తామనడం ఎంత వరకు సమంజసం?
– కుసుమ మునిప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం
మొండి వైఖరి విడనాడాలి
సీపీఎస్ అమలుపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి. దాదాపు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలు అందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేశాక పింఛన్, గ్రాట్యుటీ వంటి సదుపాయాలు అందుకోకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వం నిరంకుశ విధానం విడనాడి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్ విధానంలో ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులు జారీ చేసినా అవి ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు.
– ఎం.రవికుమార్, జిల్లా అధ్యక్షుడు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment