గ్రూప్స్‌పై గురి
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం గ్రూప్స్‌లో సక్సెస్.. తద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవడం.. ఖాళీలు వందల్లో ఉంటే... పోటీ లక్షల్లోనే! ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో గ్రూప్-2 పోస్టులు 439.. 5,64,431 దరఖాస్తులు.. తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు పోటీ ఏ మేరకు ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘ఇంత పోటీని తట్టుకొని విజయం సాధించడం కష్టమే’ అంటూ నిట్టూరుస్తున్న ఔత్సాహికులకు టీఎస్‌పీఎస్సీ తీపి కబురు అందించింది.
పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు పూర్తిస్థాయి ప్రిపరేషన్‌కు మరింత సమయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త సిలబస్‌పై కసర త్తు, గ్రూప్స్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పరీక్షల్లో రాణించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విజయానికి చేరుకోవడమెలా? అనే దానిపై ‘అష్ట’ సూచనల సమాహారం..
1. పటిష్ట ప్రణాళిక
పోటీ పరీక్షలో విజయానికి పటిష్ట ప్రణాళిక అవసరం. గ్రూప్స్ ఔత్సాహికులు రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోవాలి. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ వంటి అంశాలను రోజూ చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే పూర్తిచేయాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది విజయానికి చేరువ చేస్తుంది. రోజుకు పది గంటలు ప్రిపరేషన్‌కు అందుబాటులో ఉంటే ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటలు కేటాయించాలి. ఇప్పటికే సిలబస్ పూర్తిచేసి ఉంటే, మరోసారి క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు సిద్ధపడాలి.
2. అనుసంధానత
స్మార్ట్ ప్రిపరేషన్‌ను అలవరచుకోవడం ప్రధానం. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసే దిశగా ఆలోచించాలి. గ్రూప్1, 2 సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి, వాటిని ఒకేసారి అధ్యయనం చేయాలి. ఇలా అనుసంధానించుకుంటూ చదవడం వల్ల సమయం ఆదా అవుతుంది. దాంతో పాటు సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. ఉదాహరణకు తెలంగాణ సిలబస్‌ను పరిగణలోకి తీసుకుంటే.. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్‌లో ‘తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం’ అంశాలున్నాయి. అదే విధంగా పేపర్-2 సిలబస్‌లో ప్రాచీన తెలంగాణలో సాంఘిక-సాంస్కృతిక పరిస్థితులు అనే అంశాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
3. సొంత నోట్స్
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్‌నోట్స్‌ను తయారు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలాముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన భావనలపై పట్టు సాధించేందుకు షార్ట్‌నోట్స్ దోహదపడుతుంది.
4. రివిజన్
పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి. ఇంకా తేదీలు ప్రకటించకపోయినా, వాటి గురించి ఆలోచించకుండా సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి.
5. మోడల్ పేపర్ల ప్రాక్టీస్
చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం పూర్తయ్యాక పేపర్ల వారీగా మోడల్ టెస్ట్‌లు రాయాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనంగా ఉన్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపైనా పట్టు సాధించాలి. పరీక్షకు ముందు వీలైనన్ని గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మరవొద్దు. టీఎస్‌పీఎస్సీ ఇటీవల కాలంలో వివిధ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించింది. వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2 ప్రీవియస్ పేపర్స్‌ను పరిశీలించడం మేలు చేస్తుంది.
6. గ్రూప్ స్టడీ
పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించడానికి గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. వీలైన సమయాల్లో అభ్యర్థులు తమ స్నేహితులతో కలిసి చదవాలి. వివిధ అంశాలపై చర్చించాలి. ఒకరికి తెలియని అంశాలను మరొకరితో పంచుకోవాలి. ఇలా చర్చించిన అంశాలు చాలా కాలం పాటు గుర్తుంటాయి. మెటీరియల్ పరంగా లోటుపాట్లు ఉంటే అవి గ్రూప్ స్టడీ వల్ల తొలగిపోతాయి.
7. సమకాలీన అంశాలు
గ్రూప్స్‌లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలి. వాటిని సిలబస్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి.
8. స్వీయ విశ్లేషణ
సబ్జెక్టులను ప్రిపేరవుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా.. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి, నివృత్తి చేసుకోవాలి.
సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి
తెలంగాణ గ్రూప్స్ ఆశావహులు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అంశాలపై దృష్టిసారిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జీఎస్ పేపర్లో తెలంగాణ ప్రత్యేక అంశాల నుంచి దాదాపు 40 ప్రశ్నలు వచ్చినట్లు అర్థమవుతోంది. ఏపీ ఔత్సాహికులు దీర్ఘ కాలిక ప్రిపరేషన్ వ్యూహాలను అనుసరించాలి.
- ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్.