నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. సర్కారీ కొలవుల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల కానున్నాయి.
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. సర్కారీ కొలవుల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల కానున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 210 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకానికి బుధవారం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమీప భవిష్యత్తులో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పోలీసు కానిస్టేబుల్, ఉపాధ్యాయుల నియామకాల కోసం ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
పంచాయతీ కార్యదర్శి పోస్టుకు అర్హతలు
డిగ్రీతో పాటు 18-36 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. డిగ్రీలో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు. డిగ్రీ పూర్తయిన ఏడాది నుంచి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున 10 మార్కులు అదనంగా కేటాయిస్తారు. కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు డిగ్రీ అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి సర్వీసు కాలానికి ఏడాదికి మూడు మార్కులు చొప్పున గరిష్టంగా 15 మార్కుల వరకు కేటాయిస్తారు.
నవంబర్1వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 29వ తేదీన నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు.
త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు
జిల్లాలో ఖాళీగా ఉన్న 152 వీఆర్‌ఓ పోస్టులతో పాటు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్న వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాగం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ పోస్టుల నియామకాలకు అనుమతి కోరుతూ నెల రోజుల కింద జిల్లా కలెక్టర్ కార్యాలయం సీసీఎల్‌ఏ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపించింది. అయితే సమ్మె కారణంగా సీమాంధ్ర జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందలేదు. అక్కడి నుంచి కూడా ప్రతిపాదనలు అందితే వీఆర్‌ఓ, వీఆర్‌ఏల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించనుందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి.
అదే విధంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 936 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లా విద్యాశాఖ ఈ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించింది.
జిల్లాలో ఖాళీగా ఉన్న 150 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో ప్రకటన విడుదల చేస్తామని నిజామాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ సరిగ్గా నెల రోజుల కింద ప్రకటించారు. దీనిపై కసరత్తు కొనసాగుతోందని పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.