సాక్షి కథనానికి స్పందన, నాగరాజుకు ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో రెండు కాళ్లు, చేయి పోగొట్టుకున్న పిడమర్తి నాగరాజుకు సర్కారు అండగా నిలిచింది. ప్రభుత్వ సహాయం అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంకు చెందిన నాగరాజుపై ‘అందరికీ భారమై బతుకుతున్నా..’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బుధవారం నాగరాజుకు వ్యక్తిగతంగా రూ. లక్ష ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
తనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని నాగరాజు కోరడంతో వెంటనే అందుకు మంత్రి అంగీకరించారు. మిర్యాలగూడలోని మార్కెట్‌యార్డులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు సాక్షితో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా రెండు కాళ్లు, చేయి కోల్పోయాను. అప్పుడు నా వద్దకు ఎంతో మంది వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కనబడకుండా పోయారు.
ప్రభుత్వ సహాయం కోసం హైదరాబాద్ వచ్చి.. సచివాలయం చుట్టూ తిరిగా.. ఇక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు చచ్చిపోవాలనుకున్నా... కానీ, ‘సాక్షి’ నా గోడును సర్కారుకు తెలియజేసింది. నాకు న్యాయం జరిగేలా చేసిన ‘సాక్షి’కి రుణపడి ఉంటా..’’ అంటూ గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో తన మాదిరిగా వికలాంగులైన వారు చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కూడా సర్కారు ఆదుకోవాలని కోరారు.