బాబూ.. జాబేది? | Jabedi wrong ..? | Sakshi
Sakshi News home page

బాబూ.. జాబేది?

Published Sat, Nov 15 2014 3:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

బాబూ.. జాబేది? - Sakshi

బాబూ.. జాబేది?

కర్నూలు (జిల్లా పరిషత్) : ప్రభుత్వ ఉద్యోగం.. నేటి యువత లక్ష్యం. ఎంటెక్, ఎమె్మీ స్స.. ఇలా ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ ఉద్యోగం చిన్నదైనా  చాలనుకునే వారు నేడు చాలా మంది ఉన్నారు. వీరంతా పల్లెలను విడిచి పట్టణాల బాట పడుతున్నారు. కోచింగ్ సెంటర్లలో తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. ఉద్యోగంతోనే ఊరికి వెళ్లాలని దీక్షతో చదువుతున్నారు. అయితే వీరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. అది ఇదిగో అంటూ.. నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది.
 
 జిల్లాలో ప్రతి ఏటా 12 వేల మందికి పైగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారిలో ఐదు శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన వారిలో 50 శా తం ఎటూ వెళ్లలేక స్థానికంగానే అర్హతకు తగని చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి పోతున్నారు. అందులోనూ మిగిలిన వారు ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ల కోసం శిక్షణ  కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

రైల్వే, బ్యాంకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఐ, వీఆర్‌ఏ, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి వంటి పోస్టుల కోసం కర్నూలులోని శిక్షణ  కేంద్రాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా సగటున ఖర్చు చేస్తున్నారు.
 
 జిల్లాలో 91 వేల మంది నిరుద్యోగులు
 జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అక్టోబర్ 31వ తేదీ వరకు 91 వేల మంది అభ్యర్థులు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతీ సంవత్సరం 8 వేల నుంచి 12 వేల మంది ప్రొఫెషనల్ కోర్సులు మినహా వివిధ రకాల విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు రిజిస్టర్ చేసుకుంటున్నారు. 2012లో 10,228 మంది రిజిస్టర్ చేసుకోగా 2013లో 6,301 మంది, 2014లో అక్టోబర్ 31 వరకు 8,340 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు.

ప్రస్తుతం టెన్త్ పూర్తి చేసిన వారు 31,600, ఇంటర్ పూర్తి చేసిన వారు 21,568, డిగ్రీ పూర్తి చేసిన వారు 7,400, టైపిస్ట్ పూర్తి చేసిన వారు 3 వేలు, బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన వారు 7 వేలు, డిప్లమా కోర్సులు పూర్తి చేసిన వారు 6 వేలు, ఐటీఐ చేసిన వారు 10,600 మంది జిల్లాలో ఉన్నారు.  వీరు గాక ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోని వారు రెండింతలు ఉంటారని అంచనా.
 
 ఉపాధి ఁకల్పన* శాఖ
 ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే 20 ఏళ్ల క్రితం చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అభ్యర్థులు పేరు నమోదు చేసుకునే వారు. ప్రభుత్వంలో ఏర్పడే ఖాళీలను అనుసరించి ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను ఆయా శాఖలకు పంపించేవారు. ఆ మేరకు ఆయా శాఖల నుంచి నేరుగా అభ్యర్థుల ఇళ్లకు కాల్ లెటర్లు వచ్చేవి.

ఈ విధానానికి వ్యతిరేకంగా అప్పట్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లకు రిజిస్టర్ చేసుకున్న వారే కాకుండా ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని 1994లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఉపాధి కల్పనా కార్యాలయంలో రిజిస్టర్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ శాఖ జాబ్‌మేళాలు నిర్వహించేందుకు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పర్యవేక్షణకు పనిచేస్తున్నాయి.
 
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ ఉద్యోగశ్రీ పేరిట చేపట్టే ప్రైవేటు నియామకాలు సైతం ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ద్వారా జరిగేవి. గత ప్రభుత్వ హయాం నుంచి రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి ఉపాధి కల్పన శాఖ పాత్ర కూడా లేకుండా చేశారు.
 
 కోచింగ్‌కు లక్షన్నర ఖర్చయ్యింది
 నేను హైదరాబాద్‌లో ఎంఎస్సీ మైక్రోబయాలజి పూర్తి చేశాను. గ్రూప్ వన్‌కు రెండుసార్లు, గ్రూప్-2కు రెండు సార్లు పరీక్ష రాశాను. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. గత సంవత్సరం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన మల్టీ టాస్కింగ్ పరీక్ష కూడా రాసి క్వాలిఫై అయ్యాను. అయినా పోటీ ఎక్కువున్న కారణంగా బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటున్నాను.  ఇప్పటిదాకా నాకు అన్ని పరీక్షలకు శిక్షణ కోసం రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యింది.
 -వందనారాణి, ఎంఎస్సీ మైక్రోబయాలజి
 
 ఉద్యోగం లేదని గేలి చేస్తున్నారు
 నేను 2011లో బిఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఆర్‌ఆర్‌సీ, వీఆర్‌వో పరీక్షలు రాసినా క్వాలిఫై కాలేదు. బీఈడీ వారికి ఎస్‌జిటీ పోస్టులు తక్కువగా ఉన్నాయి. మరోవైపు పాతికేళ్లు వచ్చినా ఇంకా తండ్రిపై ఆధారపడుతున్నానన్న భావన మనసులో తొలచివేస్తోంది. ఊళ్లోనూ ఉద్యోగం లేదని గేలి చేస్తున్నారు. దీంతో ఎలాగైనా బ్యాంక్ ఉద్యోగం సాధించాలని శిక్షణ తీసుకుంటున్నాను.
     -బి. నరసింహ, ఆలూరు
 
 డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా
 2011లో నేను దూరవిద్య ద్వారా ఎంఎస్సీ పూర్తి చేశాను. కొన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్‌గా పనిచేశాను. 2012లో డీఎస్సీ, ఆర్‌ఆర్‌బి క్లర్క్ పోస్టులకు పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. మళ్లీ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తాత్సారం చేస్తోంది.
 - రామకృష్ణగౌడ్, జూపాడుబంగ్లా
 
 నోటిఫికేషన్లు రావడం లేదు
 మా వద్ద బ్యాంకింగ్  పోస్టులకు శిక్షణ కోసం వచ్చే వారిలో 50 శాతం మంది బీటెక్, మిగిలిన 50 శాతంలో బీఈడీ, జనరల్ డిగ్రీ చేసిన వారు వస్తున్నారు. సాఫ్ట్‌వేర్ బూమ్ తగ్గడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు బ్యాంకింగ్ రంగంవైపు చూస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
 -కె. రోశిరెడ్డి, శ్రీ సాయిక్రిష్ణ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్
 
 పారిశ్రామిక కారిడార్ వెంటనే ఏర్పాటు చేయాలి
 స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇచ్చే ఉద్యోగాలకూ ఉపాధి కల్పనా కార్యాలయం లేదా యువజన సర్వీసుల శాఖ ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేయాలి. సీఎం ప్రకటించినట్లుగా జిల్లాలో పారిశ్రామిక కారిడార్ త్వరగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఊరట కలుగుతుంది.
 -ఎస్.రాజశేఖర్, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనర్, కర్నూలు

 జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం
 జాబ్‌మేళాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారితో పాటు బయటి వారికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పాలిటెక్నిక్, పారామెడికల్, ఐఐటీ వంటి ఉపాధి కల్పించే కోర్సులను అభ్యసించాలని కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లో విద్యార్థులకు చెబుతున్నాం. వారికి కెరీర్ గెడైన్స్ ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు 1ః20 నిష్పత్తిలో అభ్యర్థులను పంపిస్తున్నాం. అయితే ఓపెన్ కాంపిటీషన్‌లో ఎందరికి ఉద్యోగాలు వస్తున్నాయో తెలియడం లేదు.     

-పి. ప్రతాపరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement