Telangana News: ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది!
Sakshi News home page

ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది!

Published Sun, Sep 24 2023 1:16 AM | Last Updated on Sun, Sep 24 2023 2:10 PM

- - Sakshi

పెద్దపల్లి: కూతురు భారం కాదు.. ఆమెను ప్రోత్సహిస్తే కుటుంబానికి అండగా నిలుస్తూ ఇంటికి వెలుతురునిస్తుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునేవారికి ఆ భావన తప్పు అని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. కళలు, క్రీడలు, చదువులు, ఉద్యోగాల్లో రాణిస్తూ మగవాళ్లకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులకు తమను చూసుకునే కొడుకుల్లేరనే బాధను మర్చిపోయేలా చేస్తున్నారు. వారి ఆశలను తీరుస్తూ.. కలలను నిజం చేస్తూ ఇంట్లో ఆనందాన్ని పంచుతున్నారు. నేడు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

ముగ్గురూ ఉద్యోగులే..
మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన మండల కిష్టయ్య–సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సరిత, సవిత, కీర్తి ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సరిత పీజీ, బీఎడ్‌ పూర్తి చేసి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి, ఇబ్రహీంపట్నం మండలంలో విధులు నిర్వహిస్తోంది.

సవిత డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌ టీచర్‌గా పని చేస్తోంది. కీర్తి 2020లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి, కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. తాము కూతుళ్లనే కొడుకులు భావించి, ఉన్నత చదువులు చదివించామని, వారు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పేద కుటుంబంలో పుట్టాం..
మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. పేద కుటుంబంలో పుట్టాం. అమ్మానాన్న జడల రామస్వామి, లక్ష్మి. నాన్న ఇంటివద్దే దుస్తులు అమ్మి, కుటుంబాన్ని పోషించేవారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకున్నాం. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మమ్మల్ని అమ్మానాన్న ప్రోత్సహించారు.

అక్క రాజమణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కరీంనగర్‌లో పని చేస్తోంది. నేను 2012లో ఐఏఎస్‌ సాధించా. ప్రస్తుతం పెద్దపల్లి అడిషనల్‌ కలెక్టర్‌గా పని చేస్తున్నా. భర్త శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇద్దరు అహిలన్‌, అభిషన్‌ సంతానం. చెల్లెలు జ్యోతి హైదరాబాద్‌లో బ్యాంకింగ్‌ రంగంలో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తోంది. నాలుగు మాసాల క్రితం నాన్న చనిపోవడం తీరని బాధను మిగిల్చింది.

కష్టపడి లక్ష్యం చేరుకున్నా..
మాది ప్రకాశం జిల్లా. నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. మేం నలుగురు అక్కాచెల్లెల్లం. నాన్న షేక్‌ యూసుఫ్‌ పాషా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, తల్లి షబీరా హౌస్‌ వైఫ్‌. నలుగురు కూతుళ్లలో నేనే పెద్దదాన్ని. పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంటి వద్దే ఉంటూ వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటివే జీవితం అనుకోలేదు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకున్నాను.

2003లో గ్రూప్‌–1 రాసి, ఎంపీడీవోగా, 2009లోనూ రాసి, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. 2011లో మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చాను.

2020లో వనపర్తికి కలెక్టర్‌గా వెళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాను. పెద్ద చెల్లెలు నజీబీ లండన్‌లో స్థిరపడగా రెండో చెల్లెలు పర్వీన్‌ టీఎస్‌ ఎస్‌లో మంచి పొజిషన్‌లో ఉంది. చిన్న చెల్లెలు బీఫార్మిసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. అమ్మానాన్న అందరూ ఆడపిల్లలే అని బాధ పడలేదు. చదువుల్లో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉన్నారు. వారి వల్లే మేము ఈ పొజిషన్‌లో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి.

అమ్మ గర్వపడుతోంది..
మా స్వగ్రామం మేడిపల్లి మండలంలోని తొంబర్‌రావు పేట. కోరుట్లలో స్థిరపడ్డాం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నాన్న బుచ్చిలింగం గల్ఫ్‌ కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీ కార్మికురాలు. పిల్లలు ఆడవాళ్లనే భావన ఎప్పుడూ వారిలో చూడలేదు.

అందరినీ ఉన్నత చదువులు చదివించారు. నేను బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి, వ్యవసాయ అధికారి ఉద్యోగం సాధించాను. చెల్లెళ్లు విశాల, రమ్య పీజీ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. నాన్న గల్ఫ్‌ నుంచి వచ్చి, అనారోగ్యం బారిన పడినా అమ్మ బీడీలు చుట్టి, మా చదువులు పూర్తి చేయించింది. ప్రస్తుతం ప్రయోజకులుగా మారిన మమ్మల్ని చూసి, మా అమ్మ గర్వపడుతోంది.

మా కల నిజం చేసింది..
మాది సిరిసిల్ల. మా అమ్మాయి శివాని పదోతరగతి నుంచి చదువుల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతోంది. పదోతరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్‌లో 968 మార్కులు సాధించింది. బీటెక్‌ ఈసీఈ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ కంపెనీలో ఏడాదికి రూ.32 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగిగా పని చేస్తోంది. అమ్మాయి మా కల నిజం చేసినందుకు సంతోషంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement