సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను తగ్గించేందుకు పరిపాలన విభాగం సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహించేలా రూపొందించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కార్యాలయానికి పంపింది. అయితే ఒక్క రోజు పనిదినాన్ని తగ్గించి ఐదు రోజుల పనిదినాలలో ఒక గంట ఎక్కువ పనిచేసేలా సర్దుబాటును చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రెండో, నాలుగో శనివారం సెలవు ఉంది. మొదటి, మూడో, ఆ నెలలో ఐదో శనివారం వస్తే కార్యాలయాలు తెరిచే ఉంటాయి. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులతో జీవనం సాగించే ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ఉండాలని కొన్ని సంవత్సరాలుగా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వారానికి రెండు రోజులు కార్యాలయానికి సెలవు ఉంటే ఇంధనం, విద్యుత్, నీరు, అధికారుల పర్యటన కోసం వాహనాలకయ్యే ఖర్చులు ఇలా అనేక రకాల పొదుపు ఉంటాయని పేర్కొన్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయని అన్నారు సదరు ప్రతిపాదన ముఖ్యమంత్రి చవాన్‌కు పంపించినట్లు సామాన్య పరిపాలన విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎస్.మీనా అంగీకరించారు. అయితే అంతకుముందు 1986, 87లో ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేశారు. అపుడు అదనంగా గంట పనిచేయాలనే నిబంధన విధించారు. తర్వాత వారానికి ఆరు రోజులు పని దినాలు చేసినప్పటికీ అదనంగా పెంచిన గంట మాత్రం తగ్గించలేదు. ఆ నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు ఇప్పటికీ ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రూపొందించిన ప్రతిపాదనలో వారానికి ఐదు రోజుల పనిదినాలు చేయాలంటే రోజుకు అదనంగా ఒక గంట పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటలు కార్యాలయాల్లోనే ఉండాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించిన తరువాత మంజూరు కోసం కేబినెట్ ముందుకు రానుంది. బహుశా ఈ ప్రతిపాదనను 2014 జనవరి నుంచి అమలుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది దూర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే ఉద్యోగులకు ఊరట కలిగించనుంది. కనీసం వారానికి రెండు రోజులు కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుకలగనుంది. నగరంలో ఇళ్ల ధరలు చుక్కలను తాకడంతో సామాన్య ఉద్యోగులు అత్యధిక శాతం శివారు ప్రాంతాలకు తరలిపోయారు. వారు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగించాలంటే రోజు కనీసం నాలుగైదు గంటలు వృథా అవుతోంది. పైగా ట్రాఫిక్ జాంలో సమయానికి కార్యాలయానికి చేరుకోవడం ఉద్యోగులకు ఒక అగ్నిపరీక్షగా మారింది. కానీ కొత్త ప్రతిపాదన అమలైతే పనివేళల్లో మార్పులు చేయనున్నారు.
ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 9.50 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉదయం 9.20 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఎంత ఆలస్యంగా వస్తే అంత ఎక్కువ సేపు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అత్యవసరం కోసం నెలకు కేవలం గంట మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు మినహాయింపు ఇవ్వనున్నారు.