- అధునాతన మిషన్ల సాయంతో పాల సేకరణ
సాక్షి, బళ్లారి : నేటి యువత మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వశక్తితో ముందుకు వెళుతూ పలువురికి మార్గదర్శకంగా నిలిచాడు ఒక ఇంజనీరింగ్ పట్టుభద్రుడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా గుండుముణుగు గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అనంతరం మరొకరి కింద ఎందుకు పని చేయాలనుకుని ఉద్యోగానికి స్వస్తి చెప్పి తనకున్న పొలంలో వ్యవసాయంపై దృష్టి పెట్టారు. పండ్ల తోటల పెంపకంతోపాటు పాడి పరిశ్రమపై మరింత దృష్టి సారించాడు. రూ.40 లక్షలతో పాడి పరిశ్రమను స్థాపించాడు. 20 జర్సీ ఆవులతో పాడి పరిశ్రమను ఏర్పాటు చేశాడు.
అందుకు అధునాతన షెడ్లు, యంత్రాలు ఏర్పాటు చేసి పాలు పితకడానికి ప్రత్యేక మిషన్లు ఏర్పాటు చేశారు. ఆవు పేడతో గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆవు పేడతో వచ్చిన గ్యాస్ వల్ల విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశాడు.తద్వారా రెండు మోటార్లు ఆడే విధంగా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రతి రోజు 200 నుంచి 300 లీటర్ల పాల ఉత్పత్తితోపాటు ఈ సందర్భంగా న్యూస్‌లైన్‌తో తిప్పేస్వామి మాట్లాడుతూ రైతే రాజు అని నిరూపించేందుకు తాను 20 ఆవులను పెంచి ప్రతి రోజు 300 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నానన్నారు. నలుగురు కూలీలు, మేత, దాణా ఖర్చు పోను నెలకు లక్ష రూపాయలు మిగులుతోందన్నారు. పాడిపరిశ్రమ వల్ల పాలు పితికే యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నానని, దీని వల్ల పని ఒత్తిడి తగ్గిందన్నారు.