తల్లే కూలి పనిచేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. అమ్మే పక్కన నిలబడితే ఏ కూతురి కలైనా తీరకుండా ఉంటుందా?!
ఒక కలగంటోంది అనూరాధ. కేయేఎస్ ఆఫీసర్ అవాలి తను! ‘నో’ నువ్వు ఆ కల కనేందుకు లేదు. నీ పెళ్లి గురించి కలగను’ ఆనేశాయి ఆమె ఇంటి పరిస్థితులు. అయితే పరిస్థితుల్నే మార్చుకోవాలని నిశ్చయించుకుంది అనూరాధ. ‘‘ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోకూడదు’’ అని తీర్మానించుకుంది. ఆమె కంటున్న కేయేఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కలకు పేదరికం మరో అవాంతరం అయింది. తనూ సంపాదిస్తేనే ఇంటికి ఇన్ని తిండి గింజలు. కలను పండించుకోడానికి పొలానికి వెళ్లింది. వ్యవసాయ కూలీగా నాలుగు రాళ్లు సంపాదిస్తూ, మిగతా సమయంలో కేయేఎస్ కు ప్రిపేర్ అవుతోంది. ఇరవై రెండేళ్ల అనూరాధ పోస్ట్ గ్రాడ్యుయేట్. పీజీ చేసి, కూలి పనికి వెళ్లేందుకు ఆమె ఏమీ సిగ్గుపడటం లేదు.
పొలం నుంచి తిండి గింజలకు మాత్రమే అనూరాధ సంపాదించుకు రావడం లేదు. కొన్ని బుక్స్ కొనాలి. ఖరీదైనవి. కోచింగ్ కూడా అవసరం. ఆ ఖర్చుల కోసం కూడా పొలం పనులు చేస్తోంది. తలపై ఎర్రటి ఎండ. కనురెప్పల మాటున తను కంటున్న కల. కలే ఆమెకు ఆ ఎండలో చల్లదనం, శక్తీ! అడవి అంచుల్లో ఉంది ఆమె గ్రామం. మైసూరు జిల్లా, హెమ్‌డి కోటె తాలూకాలోని తిమ్మనహోతలహళ్లి. గ్రామంలా ఉండదు. గిరిజన గూడెంలా ఉంటుంది. అక్కడొక చదువుల పువ్వు పూసిందంటే ఏ అండా, ఆశా లేకుండా తనకై తను వికసించిందనే! అలాంటి విద్యాకుసుమం అనూరాధ. తండ్రి లేడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. ఆస్తి లేదు. డబ్బు లేదు. తల్లే కూలి పని చేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది.
ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. తల్లి మద్దతుతో కేయేఎస్ ప్రిలిమ్స్ పాసైనంతగా సంబరపడింది అనూరాధ. అయితే ఆ అమ్మాయి కేయేఎస్ ఆఫీసర్ అవాలని అనుకుంటున్నది తన కోసమో, తల్లి కోసమో కాదు. గిరిజన గూడేల్లో తనలాంటి ఆడపిల్లలు, ఇంటి బరువు బాధ్యతల్ని తమరొక్కరే మోస్తున్న తల్లులు ఇంకా ఉన్నారు.
వారికోసం ఏమైనా చేయాలని అనుకుంది. పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని చదివించే ఆఫీసర్‌గా, వారి తల్లిదండ్రులకు నమ్మకమైన ఒక ఉపాధిని కల్పించగల అధికారిగా తను ఎదగాలని అనుకుంది. ఆ అనుకోవడం లోనే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి పొలం పనులకు వెళ్లి రావడంలోనే పి.ఇ.టి.సి.కి దరఖాస్తు చేసే గడువు తేదీ దాటిపోయాక గానీ ఆమెకు తెలియలేదు! ఐయ్యేఎస్, కేయేఎస్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమమే పి.ఇ.టి.సి. ప్రీ–ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్.
సాంఘిక సంక్షేమ శాఖ ఉచితంగా ఈ శిక్షణను ఇస్తుంది. ఆన్‌లైన్‌లో ప్రాసెస్ అంతా నడవడంతో దరఖాస్తు సమాచారాన్ని సమయానికి చూడలేకపోయింది అనూరాధ. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లు బస వసతి కాకుండా, కేవలం శిక్షణకే 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కూలి పనితో కూడబెట్టగలిగింది కాదు. ఇంకో పని కూడా వెతుక్కోవాలని అనూరాధ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కేయేఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అనూరాధ కష్టపడటం అసాధారణమైన విషయమే అయినప్పటికీ అనూరాధ వంటి ఒక నిరుపేద గిరిజన యువతి అసలు పీజీ చేయడం కూడా కేయేఎస్ ఆఫీసర్ అయినంత ఘన విజయమేనని శైలేంద్ర కుమార్ అంటున్నారు. గిరిజన సామాజిక కార్యకర్త అయిన శైలేంద్ర ప్రస్తుతం అనురాధ కోచింగ్ కోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment