సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో లక్షలాది మంది నిరుద్యోగులు వరుసగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షల్లో దాదాపు లక్ష మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. మరో 13 రోజుల్లోనే పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. వీఆర్‌వో పోస్టుల తరహాలోనే జిల్లాలో ఈ పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... జిల్లాలో ఉన్న 88 పోస్టులకు 57,878 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అంటే ఒక్కో పోస్టుకు సగటున 657 మంది పోటీ పడుతున్నారు. ఇటీవలే జరిగిన వీఆర్‌వో పరీక్షలకు ఒక్కో పోస్టుకు సగటున వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డ విషయం విదితమే. కార్యదర్శి పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తుల సంఖ్య కూడా అదే తీరు పోటీని తలపిస్తోంది. వీఆర్‌వో పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులే ఎక్కువ మంది కార్యదర్శి పోస్టుకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలనే నిబంధన ఉండటంతో కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల సంఖ్య కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది. షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 23న పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో 165 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఏపీపీఎస్సీకి పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గత ఏడాది డిసెంబరు 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 88 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. గత నెల 26న దరఖాస్తుల గడువు ముగిసింది. రిజర్వేషన్ల వారీగా అన్ని జిల్లాల్లోని ఖాళీల వివరాలను నోటీఫికేషన్‌లోనే పొందుపరిచింది. పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నేరుగా భర్తీ చేస్తారు.
ఒక్కో పోస్టుకు 657
Published Mon, Feb 10 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement