బిడ్డ శవాన్ని నెత్తిన పెట్టుకుని... | Orca Mother Carrying Dead Calf For Days | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 28 2018 9:17 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Orca Mother Carrying Dead Calf For Days - Sakshi

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూలం అమ్మ. గర్భాశయంలో పెంచి, జన్మనిచ్చే ప్రేమమూర్తి. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అలాంటి అమ్మ ప్రేమ కంటే గొప్పది.. భద్రమైంది మరేదీ ఉండదు. అలాంటిది చనిపోయిన తన బిడ్డ చలనం రాకపోతుందా అన్న ఆశతో నాలుగు రోజులపాటు మోసుకు సుదూర ప్రయాణం చేసిందో తల్లి.

వాన్‌కోవర్‌: బ్రిటీష్‌ కొలంబియా, విక్టోరియాలోని తీర ప్రాంతం. J35 అనే ఓర్కా తిమింగలం(కిల్లర్‌ వేల్‌.. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దది) 17 నెలలుగా ఆ మధుర క్షణాల కోసమే ఎదురు చూసింది. గత మంగళవారం ఉదయం అది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అవి గుంపుగా జీవించే జీవులు కావటంతో.. మిగతావి దాని దగ్గరికొచ్చి బిడ్డను చూసి సందడి చేశాయి. కాసేపు నీటిలో హాయిగా చక్కర్లు కొట్టిన ఆ పిల్ల ఓర్కా.. కాసేపటికే చలనం లేకుండా పోయింది. గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. ఎలాగైనా మళ్లీ ఊపిరి పోయాలన్న ఆలోచనతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం ప్రారంభించింది. అలా గంటలు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల బరువు..  ఏకంగా నాలుగు రోజులపాటు ఏకధాటిగా 185 కిలోమీటర్లు ప్రయాణించింది. సాన్‌ జువాన్‌ ఐలాండ్‌ వద్ద వేల్‌ రీసెర్చర్‌ ‘కెన్‌ బాల్‌కోమ్‌’ J35ను గుర్తించి దాని వ్యధను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 

’సాధారణంగా జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే. అయితే ఇన్నిరోజులపాటు ఓపికగా ఎదురు చూడటం బహుశా ఇదే తొలి ఘటన అయి ఉండొచ్చు. ఈ నాలుగు రోజులు అది చాలా అవస్థలు పడింది. తిండికి కూడా దూరంగా ఉంది. ఊపిరి కష్టమైన బిడ్డను తల నుంచి దించలేదు. రోజుకు 60 నుంచి 70 మైళ్ల మధ్య అది ఈదుతూ వచ్చింది. బిడ్డలో కదలిక కోసం అది తీవ్రంగా యత్నించింది. ఈ భావోద్వేగాన్ని షూట్‌ చేయాలని నిర్ణయించి దాన్ని ఫాలో అయ్యాం. గుండెకు తాకేలా ఉన్న ఈ కథనాన్ని ప్రపంచానికి తెలియజేశాం’ అని బాల్‌ కోమ్‌ చెబుతున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement