
సాక్షి, హైదరాబాద్ : పుణే పోలీసులు విచారణ పేరుతో హైదరాబాద్‌లో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు జరపడమే కాకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం సహించరానిదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు. పీసీఐ కమిటీ పర్యటనలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న అమర్ ఈ సంఘటనపై స్పందించారు. పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి మీడియా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికే పోలీసులు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అమర్ స్పష్టం చేశారు.
పోలీసుల చర్యను ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే
మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే, తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజాసంఘాల ప్రముఖులు వరవరరావు, కూర్మనాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై పుణే పోలీసులు దాడులకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజే) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు అని పేర్కొన్నారు. పోలీసు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.
అరెస్టులు సరికాదు: టీయూడబ్ల్యూజే
మోదీ హత్యకు కుట్ర పేరుతో పుణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి ఇళ్లలో అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, క్రాంతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment